Monday, December 23, 2024

ఎంపి అవినాష్ అరెస్టు తప్పదా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సిబిఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల తెలంగాణ హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ హత్య కేసుకు సంబంధించిన కీలక వివరాలను కౌంటర్ లో దాఖలు చేసింది. అవినాష్ ని అరెస్టు చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆయన ఉద్దేశపూరితంగానే తమ దర్యాప్తునకు సహకరించట్లేదని చెప్పింది. తమ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు అవినాష్ రెడ్డి సమాధానాలు దాటవేస్తున్నారని, వాస్తవాలు చెప్పట్లేదని సిబిఐ అధికారులు వెల్లడించారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించే విధంగా అవినాష్ రెడ్డి సమాధానాలు ఉంటున్నాయని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లు సిబిఐ వెల్లడించింది.

హత్యకు వినియోగించిన గొడ్డలిపై ఆరా

వివేకానంద రెడ్డి హత్యకు వాడిన గొడ్డలి ఎక్కడ ఉందో కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కౌంటర్ లో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి కోట్లలో జరిగిన లావాదేవీలపై అవినాష్ రెడ్డి విచారణలో తేల్చాల్సి ఉందని కౌంటర్ పిటిషన్‌లో వెల్లడించింది. సునీల్ యాదవ్‌తో పాటు అవినాష్‌రెడ్డికి సంబంధమేంటో తెలుసుకోవాలని వివరించింది. హత్య రోజున అవినాష్ రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకు వెళ్లాడనే విషయంపై కూడా స్పష్టత రావాలని, హత్య కు ట్రలో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందేమో తెలుసుకోవాలని సిబిఐ పేర్కొంది. మార్చి 15న అవినాష్ రెడ్డి ఎక్కడెక్కడ ఉన్నారో కన్ఫామ్ చేసుకోవాలో వెల్లడించింది.

విచారణ వేగవంతం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిబిఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వివేక హత్య సమయంలో రాసిన లేఖపై విచారణ చేపట్టారు. అలాగే వివేకానంద రెడ్డి పిఎ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్‌ను విచారించారు. ఇద్దరినీ కలిసి సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న లక్ష్మీదేవి కుమారుడే ప్రకాష్. తాజాగా ఇతడిని సిబిఐ విచారిస్తోంది. మంగళవారం పిఎ కృష్ణారెడ్డిని విచారించిన సిబిఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. బుధవారం మరోసారి కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాష్ ను విచారించారు. మంగళవారం కూడా వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టిన విషయం విదితమే.

అధికారులు ఆ విషయంపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పగలు 3 గంటలకు కోఠిలోని సిబిఐ ఆఫీస్ కు వచ్చిన పిఎ కృష్ణారెడ్డిని 5 గంటలకు పైగా ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లెటర్ ను ఎందుకు దాయాల్సి వచ్చిందో, అలా దాయమని ఎవరు చెప్పారో చెప్పాలంటూ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ లెటర్ ను మొదట ఎవరు గుర్తించారు, ఆ లెటర్ గురించి మీకెలా తెలిసింది, తర్వాత దాన్ని ఎక్కడ దాచి పెట్టారు, మీ వద్ద లెటర్ ఉన్నట్లు ఇంకా ఎవరితో అయినా చెప్పారా? లెటర్ ను పోలీసులకు ఎన్ని గంటల తర్వాత అప్పగించారు? అప్పటి వరకు లెటర్ ను దాయాల్సిన అవసరం ఏంటి? అంటూ అనేక ప్రశ్నలను సిబిఐ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News