Tuesday, November 5, 2024

టిఎంసి నాయకుడి ఇంట్లో ఆయుధాలు, బాంబులు లభ్యం

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులపై జనవరి 5న దాడి చేసిన కేసుకు సంబంధించి శుక్రవారం సిబిఐ అధికారులు పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని ఒక స్థానిక టిఎంసి నాయకుడి ఇంటిపై దాడి చేసి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. టిఎంసి నాయకుడు షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లేందుకు సందేశ్ ఖాళీ చేరుకున్న ఇడి అధికారులపై జనవరి 5న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం హఫీజుల్ ఖాన్ నివాసంలో సోదాలు జరిపిన సిబిఐ అధికారులకు బాంబులు, విదేశీ తుపాకులతోసహా పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించినట్లు వర్గాలు తెలిపాయి.

బాంబులు ఉన్నట్లు ముందస్తు సమాచారం అందడంతో సందేశ్‌ఖాళీలోని సర్బేరియా ప్రాంతంలో ఉన్న హఫీజుల్ ఖాన్ ఇంటిపై సిబిఐ అధికారులు దాడి జరిపినట్లు వర్గాలు తెలిపాయి. బాంబులను కనిపెట్టేందుకు తమ వెంట స్కానింగ్ పరికరాలను కూడా సిబిఐ అధికారులు తీసుకు వెళ్లినట్లు వర్గాలు చెప్పాయి. ఇడి అధికారుల బృందంపై దాడి తర్వాత 55 రోజులు పరారీలో ఉన్న షాజహాన్‌ను ఫిబ్రవరి 29న పోలీసులు అరెస్టు చేశారు. షాజహాన్‌పై భూకబ్జాలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన అరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం షాజహాన్ జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News