ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డిపిసిసి) సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మొహమ్మద్ ఆరిఫ్ నివాసంపై సిబిఐ సోమవారం దాడి చేసి రూ. 2.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నది. రూ. 91500 లంచాన్ని మార్పిడి చేసుకుంటున్నందుకు ఆరిఫ్‌ను, ఒక మధ్య దళారి కుమారుడు కిశ్లయ శరణ్ సింగ్‌ను సిబిఐ అరెస్టు చేసింది. ఆరిఫ్‌పైన దళారిపైన, మరి నలుగురిపైన, గుర్తు తెలియని ఇతర వ్యక్తులపైన సిబిఐ ఆదివారం కేసు నమోదు చేసింది. వారిలో దళారి, అతని కుమారుడు, ఒక ప్రైవేట్ సంస్థ యజమాని కూడా ఉన్నారు.
ఆరిఫ్ అవినీతి పద్ధతులకు పాల్పడుతున్నారని, ప్రైవేట్ సంస్థలకు డిపిసిసి ఆమోద ముద్రల రెన్యూ చేయడానికి లంచాలు స్వీకరిస్తున్నారని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. దళారి సంస్థల నుంచి డబ్బు తీసుకుని ఆరిఫ్‌కు క్రమం తప్పకుండా అందజేస్తున్నాడని ఎఫ్‌ఐఆర్ ఆరోపించింది. సిబిఐ అధికారులు వల పన్ని, ఆరిఫ్‌ను, దళారి కుమారుని లంచం మార్చుకుంటుండగా అరెస్టు చేశారు. అరెస్టుల దరిమిలా ఆరిఫ్ నివాసంలోను, కార్యాలయంలోను సోదాలు నిర్వహించగా, నగదు, ఆస్తి పత్రాలు కనుగొన్నారు.