Thursday, January 23, 2025

కేజ్రీవాల్‌కు 56 ప్రశ్నలు!

- Advertisement -
- Advertisement -

ప్రజలు అధికారం అప్పగిస్తే దానిని వారికోసం కొంత, తమ కోసం మరి కొంత వినియోగించుకొని చేతులు దులుపుకొనే రకం కాదు కేంద్రంలోని బిజెపి పాలకులు. అధికారంలోకి రాడానికి, తమ రహస్య అజెండా అమలు కోసం నిరంతరాయంగా అందులో కొనసాగడానికి వారు ప్రత్యేక పథకాలు, పన్నాగాలు రూపొందించుకొని అమలు పరుస్తుంటారని కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇటీవల ‘ది వైర్’ కోసం సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్‌కిచ్చిన ఇంటర్వూ చదివిన తర్వాత అనిపించడం సహజం. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కశ్మీర్‌లోని పుల్వామా వద్ద సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఉగ్ర దాడికి ప్రభుత్వం తరపు భద్రతా లోపాలే కారణమని మాలిక్ అందులో చెప్పారు.

ఈ దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. జవాన్లను తరలించడానికి ఐదు హెలీకాప్టర్లు సమకూర్చాలని సిఆర్‌పిఎఫ్ కోరగా, కేంద్ర హోం శాఖ తిరస్కరించిందని ఈ లోపాన్ని గురించి తాను నేరుగా ప్రధాని మోడీనే అడిగినప్పుడు ఆ విషయం మాట్లాడొద్దని ఆయన తనను మందలించారని అప్పటి జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా అదే హెచ్చరిక చేశారని మాలిక్ తెలియజేశారు. నింద పాకిస్తాన్ మీదికి నెట్టివేయదలిచారని తనకప్పుడు బోధపడిందని వివరించారు. అలాగే రిలయెన్స్‌కు రూ. 300 కోట్ల మేరకు మేలు చేకూర్చే రెండు పథకాలతో బిజెపి నాయకుడు రామ్ మాధవ్ తన వద్దకు రాగా వాటిని తాను తిరస్కరించానని మాలిక్ ఆ ఇంటర్వూలో చెప్పుకొన్నారు. అధికారంలో కొనసాగడానికి, సొంత మనుషులకు అడ్డదారిలో విశేషంగా కట్టబెట్టడానికి బిజెపి నేతలు దేనికైనా తెగిస్తారని ఈ ఇంటర్వూ తెలియజేసింది. దీనిలోని నిజానిజాలు పూర్తిగా బయటపడితే జాతికి మేలు జరుగుతుంది. ప్రతిపక్ష నేతల అడ్డంకిని తొలగించుకొని మళ్ళీ అధికారంలోకి రాడానికి సిబిఐని, ఇడిని బిజెపి పెద్దలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణకు ఈ ఇంటర్వూ బలాన్ని చేకూరుస్తున్నది. ముఖ్యంగా ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) వంటి పార్టీల మీద అవినీతి బురద చల్లడం ద్వారా వాటిని ప్రజల ఎదుట అప్రతిష్ఠ పాలు చేయడానికి బిజెపి కుట్ర పన్నిందని భావించక తప్పడం లేదు.

ఢిల్లీ స్థానిక పార్టీగా మొదలై ‘ఆప్ ’ అక్కడ అధికారాన్ని గెలుచుకొని అందిస్తున్న ఆదర్శవంతమైన పాలన గురించి వివరించవలసిన పని లేదు. ఆ పేరుతో పంజాబ్ రాష్ట్ర అధికారాన్ని కూడా సాధించుకొన్న ఆప్ మీద బిజెపికి గల కక్ష ఇంతఅంత కాదు. చిరకాలం తాము అనుభవించిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో కూడా ఆప్ విజయం సాధించడం కమలనాథులకు దుస్సహంగా వుంది. అందుచేత ఆ పార్టీని భ్రష్టు పట్టించాలని అది కంకణం కట్టుకొన్నట్టు బోధపడుతున్నది.ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను జైల్లో పెట్టి దాదాపు రెండు నెలలవుతున్నది. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీదనే తనకున్న అపారమైన అధికారాన్ని బిజెపి ప్రయోగిస్తున్నది. ఆయనకు సమన్లు జారీ చేసిన సిబిఐ ఆదివారం నాడు 9 గం. సుదీర్ఘ కాలం లిక్కర్ కేసులో విచారించడం ఊహించని పరిణామం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సిబిఐ విచారణకు రప్పించడం ద్వారా బిజెపి ఎటువంటి సంకేతాలను పంపించదలచిందో వివరించి చెప్పనక్కర లేదు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పలికిన పలుకులు ప్రత్యేకించి గమనించదగినవి. ‘కేంద్ర ప్రభుత్వం చాలా బలమైనది, తప్పు చేశాడా లేదా అనేదానితో నిమిత్తం లేకుండా ఎవరినైనా జైలుకు పంపించగలదు.

నన్ను అరెస్టు చేయవలసిందిగా సిబిఐని బిజెపి కోరితే దానిని పాటించడం కంటే అది వేరే ఏమి చేయగలుగుతుంది’ అని కేజ్రీవాల్ అన్న మాట ముమ్మాటికీ వాస్తవం. తనను అవినీతి పరుడని బిజెపి ఆరోపించడం గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాడానికి ముందు ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా పని చేశానని అవినీతికి పాల్పడాలని అనుకొంటే అప్పుడే కోట్లు కూడబెట్టి వుండేవాడినని అన్నారు. ఇందులో తప్పుపట్టవలసిందేమీ లేదు. తనను సిబిఐ 56 ప్రశ్నలు వేసిందని, అన్నీ నకిలీ ప్రశ్నలేనని మొత్తం కేసే తప్పుడిదని తాము అవినీతికి పాల్పడ్డామని నిరూపించడానికి వారి దగ్గర ఎటువంటి ఆధారం లేదని కేజ్రీవాల్ ఘంటాపథంగా చెప్పారు. కేజ్రీవాల్‌ను సిబిఐ ప్రశ్నించిన సందర్భంగా ఆప్ ప్రభుత్వం ఢిల్లీ అసెంబ్లీ ఒక రోజు ప్రత్యేక సమావేశాన్ని సోమవారం నాడు జరిపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా దీనిని కూడా తప్పుపట్టారు. అలా జరిపించడం నియమ విరుద్ధమన్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం స్పీకర్‌కు ఉందని ఆప్ సమాధానం చెప్పింది. ఇలా నిరంతరం ప్రతిపక్ష ప్రభుత్వాలకు అడ్డంపడుతూ లేనిపోని ఆరోపణలతో వాటి నేతలను ఇబ్బందుల పాలు చేస్తూ బిజెపి పాలకులు ఆత్మానందం పొందవచ్చు. కాని నేలకు కొట్టిన బంతి అంతకు మరింత వేగంతో పైకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News