ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సిబిఐ సమన్లు
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సిబిఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. సిబిఐ తాజా సమన్లపై సిసోడియా స్పందించారు. ఇంతకు ముందు నిర్వహించిన సోదాల్లో సిబిఐకి ఏం దొరకలేదని , అందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. “నా ఇంట్లో సిబిఐ 14 గంటల పాటు తనిఖీలు చేపట్టింది. వారికి ఏం దొరకలేదు. నా బ్యాంక్ లాకర్లనూ వెతికారు. అయినా ఏం లభించలేదు. వారికి నా గ్రామంలో కూడా ఏం దొరకలేదు. ఇప్పుడు సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు రావాలని సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరై పూర్తి సహకారం అందిస్తా. సత్యమేవ జయతే అని సిసోడియా ట్వీట్ చేశారు. ఈ కేసులో సిబిఐ గత నెలలో ఆఫ్ కమ్యూనికేషన్ చీఫ్, సిసోడియా సన్నిహితుడైన విజయ్ నయర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తీవ్రంగా స్పందించిన ఆప్
సిసోడియాకు సమన్లు జారీ చేయడంపై ఆమ్‌ఆద్మీపార్టీ తీవ్రంగా స్పందించింది. సిబిఐ సోమవారం సిసోడియాను అరెస్టు చేస్తుందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. ఈ సమన్లు త్వరలో జరగనున్న గుజరాత్ ఎన్నికలకు సంబంధించి వచ్చాయని ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఆప్ గట్టిపోటీ ఇవ్వనుందని, దీంతో బీజేపీకి భయం పట్టుకుందని విమర్శించారు. ఈ క్రమం లోని సిసోడియాలకు సమన్లు జారీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు.