Thursday, July 4, 2024

రంగంలోకి సిబిఐ

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలన కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే బీహార్‌లో పేపర్ లీక్ , పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాల పైనా సమర్ధంగా విచారించనుంది. కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు ,మోసాలు, జరిగాయని పలుచోట్ల కేసులు నమోదైనట్టు కేంద్ర విద్యామంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సదరు అధికారి వెల్లడించారు.

నీట్ పేపర్ లీకేజీ … విద్యార్థుల భారీ నిరసన
నీట్ యూజీ పేపర్‌లీక్ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఆదివారం ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద మెడికల్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. నిరసనకారులు జంతర్‌మంతర్ నుండి లోక్‌కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్రమోడీ నివాసం వరకు ర్యాలీ తీశారు. వారిని పోలీస్‌లు అడ్డుకున్నారు. ప్రధానిని కలుసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పోలీస్‌లు అనుమతి నిరాకరించి, ప్రధానికి లేఖ రాయాలని నిరసనకారులకు సూచించారు. అనంతరం ఆందోళన కారులు పోలీస్‌లకు ఆ లేఖను అందజేసి నిరసనను విరమించారు. బీహార్ పోలీసులు పేపర్ లీకేజీని బయటపెట్టారని, అందువల్ల కౌన్సెలింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు లేఖలో స్పష్టం చేశారు. “ దయచేసి న్యాయం చేయండి. మా చివరి ఆశ మీరే ’ అని విద్యార్థులు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. మే 5న నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది. ఇందులో దాదాపు 24 లక్షల మంది పాల్గొన్నారు. 60 మందికి పైగా విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడంతో పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చాయి.

లీకేజీ నిజమేనని నిర్ధారణ కావడంతో కౌన్సెలింగ్‌ను నిలిపివేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విమర్శలు కాంగ్రెస్ వంటి విపక్షాల నుంచే కాకుండా వివిధ వర్గాల నుంచి తీవ్రంగా రావడంతో ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాక సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ప్రధాన అంశం అయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా అనేక నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ ) ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్‌టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. పరీక్షలు నిర్వహించే సామర్థం ఎన్‌టీఏకు ఉందోలేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News