ఆర్‌జి కర్ మెడిక్ కాలేజీ, ఆసుపత్రిలో పోస్టు గ్రాడ్యుయేట్ ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం స్వాగతించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ ఘటనను రాజకీయం చేయడానికి ప్రతిపక్ష పిసిఎం, బిజెపి ప్రయత్నిస్తూ రాష్ట్రంలో నిరసనలకు ఆజ్యం పోస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఆందోళన చేస్తున్న డాక్టర్లు రాష్ట్రంలో వైద్య సేవలకు ఏర్పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరుకావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కలకత్తా హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉంటామని, సిబిఐకి సంపూర్ణ సహకారం అందచేస్తామని మమత తెలిపారు. సాధ్యమైనంత త్వరితంగా ఈ కేసు కొలిక్కి రావాలని తాము కోరుకుంటున్నామని, ఈ కేసును సిబిఐకి అప్పగించడం పట్ల తమకు ఎటువంటి సమస్య లేదని ఆమె తెలిపారు. ఈ కేసులో తాము అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని, తమపై దుష్ప్రచారం జరుగుతున్నదని ఆమె అన్నారు. తనను కావాలంటే దూషించుకోవచ్చని, కాని రాష్ట్రాన్ని మాత్రం దూషించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.