Monday, December 23, 2024

సిబిఐ బాధ్యత దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయడం: మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి, న్యాయానికి అవినీతి పెద్ద అడ్డంకని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నేడు ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) వజ్రోత్సవ వేడుకల్లో (డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్) ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా తమ రాజకీయ పోరాటం తగ్గదన్నారు. అవినీతిపరుడిని వదలకూడన్నదే దేశం, ప్రజల ఆకాంక్ష అన్నారు. ‘అవినీతి అనేది చిన్న నేరం కాదు. అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. దాంతో అనేక నేరాలు జరుగుతాయి’ అని ఆయన వివరించారు.

నల్ల ధనానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలెట్టిందని ప్రధాని తెలిపారు. బీనామి ఆస్తులపై కూడా పోరాడుతోందన్నారు. ‘అవినీతిపైనే కాక, మేము అవినీతి కారకాలపై కూడా పోరాడుతున్నాం’ అని ప్రధాని తెలిపారు.

అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం అనేది సమర్థవంతమైన సంస్థలు లేకుండా సాధ్యం కాదు, సిబిఐపై పెద్ద బాధ్యత ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.నేటికి పరిష్కారం కాని కేసులను సిబిఐకి అప్పగించాలన్న డిమాండ్లు ఉన్నాయన్నారు. తన పనితనం వల్ల సిబిఐ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నదన్నారు.

అవినీతి ఎక్కడ ఉంటుందో అక్కడ యువతకు సమానావకాశాలుండవన్నారు. అవినీతి అన్నది ప్రతిభకు శత్రువని ఆయన అభివర్ణించారు. ఎప్పుడైతే బంధుప్రీతి, వంశపాలన పెరుగుతాయో అప్పుడు దేశం ప్రభావితం అవుతుంది, బలహీన పడుతుందన్నారు. దేశాన్ని దోచుకోడానికి అవినీతిపరులు లూటీ మార్గాలను ఎంచుకున్నారన్నారు. వారు ప్రభుత్వ సంపదను కూడా దోచుకుంటున్నారన్నారు. నేడు ‘జనధన్’ బ్యాంకు ఖాతాలు ఆధార్, మొబైల్ ఫోన్లకు అనుసంధానమయ్యాయి. కనుక లబ్ధిదారులు పూర్తి ప్రయోజనాలు పొందుతున్నారన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News