Sunday, November 24, 2024

సిబిఎస్‌ఇ టెన్త్ పరీక్షలు రద్దు

- Advertisement -
- Advertisement -

CBSE 10th Class Examination Cancel, 12th Class Examination Postponed

 

12వ తరగతి పరీక్షలు వాయిదా

ప్రతిభ, సామర్థాలను బట్టి పదో తరగతి విద్యార్థులకు మార్కులు, పాస్
అభ్యంతరాలు తెలిపిన వారికి పరీక్షరాసే అవకాశం
12వ తరగతి పరీక్షల నిర్వహణపై జూన్1న నిర్ణయం
పరీక్షల కొత్త తేదీలు 15రోజుల ముందుగానే ప్రకటన
కరోనా ఉధృతి దృష్టా విద్యాశాఖ మంత్రితో, ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష
అనంతరం నిర్ణయం ప్రకటన

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల ఉధృతితో సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షలు రద్దు చేశారు. సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేశారు. మే నెలలో సిబిఎస్‌ఇ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వైరస్ దేశంలోని పలు ప్రాంతాలలో తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం, నైట్‌కర్ఫూలు, పలు రకాల ఆంక్షలు, కొన్ని రాష్ట్రాలలో లాక్‌డౌన్‌లు విధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల డిమాండ్‌తో అన్ని విషయాలను పరిశీలించుకుని పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వ తరగతి పరీక్షల పూర్తి రద్దు, 12వ తరగతి పరీక్షల వాయిదాకు నిర్ణయించినట్లు ప్రకటన వెలువరించారు. కరోనా పరిస్థితుల నడుమ ఇప్పుడు పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ఇబ్బందికర పరిణామం అవుతుందని వివిధ రాజకీయ పార్టీలు విమర్శించాయి. సిబిఎస్‌ఇ పరీక్షల విషయం దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది విద్యార్థుల విద్యాసంవత్సరపు భవితకు సంబంధించిన విషయం. ఈ దశలో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

తరువాత పరీక్షల గురించి కీలక నిర్ణయాన్ని విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. సాధారణంగా దేశంలో సిబిఎస్‌ఇ వార్షిక పరీక్షలు మే 4 నుంచి జూన్ 14వ తేదీ వరకూ జరుగుతాయి. సిబిఎస్‌ఇ పన్నెండవ తరగతి పరీక్షల నిర్వహణ తేదీలపై జూన్ 1వ తేదీన నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖ మంత్రి తెలిపారు. దేశంలో అప్పటికి ఉండే కరోనా పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తేదీలు ఖరారు చేస్తారు. కొత్త తేదీలపై విద్యార్థులకు కనీసం 15 రోజుల ముందు తెలియచేస్తారు. ఇక రద్దు అయిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను త్వరలో ప్రకటిస్తారని మంత్రి వివరించారు. బోర్డు రూపొందించే అబ్జెక్టివ్ క్రైటిరియా ప్రాతిపదికన ఫలితాలు ప్రకటిస్తారు. పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ, వారి సమర్థతలపై అంతర్గత అధ్యయనం ప్రాతిపదికన మార్కులు కేటాయిస్తారు. ఫలితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారని , పరీక్షలు జరిగినప్పుడు ఈ అవకాశం వినియోగించుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

విద్యార్థుల ఆరోగ్యం , తల్లిదండ్రుల శ్రేయస్సు ప్రధానమని సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టంగా తెలిపారని , ఇదే సమయంలో విద్యా సంవత్సర ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలుగకుండా చేస్తూ, విద్యార్థుల ఆరోగ్యం, వారి భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రధాని చెప్పినట్లు ఈ మేరకు తగు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 21.5 లక్షల మంది విద్యార్థులు సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. ఇక క్లాస్ 12కు సంబంధించి దాదాపు 14 లక్షల మంది పరీక్షలకు నమోదు చేసుకున్నారు.

సిబిఎస్‌ఇ పరీక్షలు రద్దు చేయాలి లేదా వాటిని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇటీవలే లక్షకు పైగా విద్యార్థుల సంతకాలతో ఓ విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. విద్యార్థుల ప్రతిభను అంతర్గతంగా సమీక్షించుకుని ఫలితాలు ప్రకటించాలని, ప్రస్తుత కరోనా ఉధృతి దశలో పిల్లలు నేరుగా పరీక్షాకేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాసే పరిస్థితిలో లేరని, ఇది రిస్క్‌తో కూడిన పని అవుతుందని తల్లిదండ్రుల బృందం కూడా ప్రధానికి లేఖ రాసింది. విద్యార్థులు, అధ్యాపకులకు ఇప్పటకీ వ్యాక్సినేషన్ జరగలేదని, ఈ దశలో పరీక్షల నిర్వహణ అనుచితం అవుతుందని , తగు నిర్ణయం తీసుకోవాలని ఇటీవలే అఖిలభారత స్థాయ పేరెంట్స్ అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News