న్యూఢిల్లీ : కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సిబిఎస్‌ఇ) తమ పాఠశాలలకు అనుబంధానికి సంబంధించిన నిబంధనలను సడలించింది. దీనితో ఆ పాఠశాలలు అదే పేరుతో అనుబంధ సంఖ్యతో బ్రాంచ్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతిస్తోందని అధికారులు వెల్లడించారు. అయితే, భౌతిక, విద్యాపరమైన మౌలికవసతుల పరంగా రెండు పాఠశాలలకు వేర్వేరు వనరులు ఉండవలసి ఉంటుంది. ప్రధాన పాఠశాలలోకి బ్రాంచ్ పాఠశాలల నుంచి తరలింపు సాఫీగా సాగిపోతుంది, నిబంధనల కింద కొత్త అడ్మిషన్లుగా వాటిని పరిగణించబోరు.
ప్రధాన పాఠశాలను 6 నుంచి 12 వరకు తరగతుల నిర్వహణకు అనుమతిస్తుండగా, బ్రాంచ్ పాఠశాలలు ప్రీ ప్రైమరీ నుంచి గ్రేడ్ 5 వరకు తరగతులు నిర్వహించవచ్చు.‘రెండు బ్రాంచ్‌ల నిర్వహణ, యాజమాన్యం ఒకటే కావాలి, రెండు పాఠశాలలకు ఒకే పరిపాలన, విద్యా పద్ధతులు ఉండాలి. రెండు బ్రాంచ్‌లకు ఉమ్మడి వెబ్‌సైట్ ఉండాలి, ఆ వెబ్‌సైట్‌లో బ్రాంచ్ పాఠశాలకు ప్రత్యేకించిన సెక్షన్ ఉండాలి’ అని సిబిఎస్‌ఇ కార్యదర్శి హిమాంశు గుప్తా స్పష్టం చేశారు. రెండు పాఠశాలలు వేర్వేరు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని నిర్వహించవలసిన అవసరం ఉంటుందని, వేతనాలను ప్రధాన పాఠశాల మాత్రమే చెల్లించాలని ఆయన సూచించారు.
ప్రస్తుతతం సిబిఎస్‌ఇ బ్రాంచ్ పాఠశాల ఏర్పాటును అనుమతించడం లేదు. ఒకే గ్రూప్‌లోని ప్రతి పాఠశాలకు వేర్వేరు అనుబంధ సంఖ్య ఉండాలి. ‘బోర్డు అన్ని అంశాలకు సంబంధించి ప్రధాన పాఠశాల ప్రిన్సిపల్‌తో మాట్లాడవలసి ఉంటుంది, అయితే, అది దానికే పరిమితం కాదు’ అని గుప్తా తెలిపారు. కనీస భౌతిక మౌలిక వసతుల అవసరాలు, విద్యార్థులభద్రత, టీచర్ విద్యార్థి నిష్పత్తికి సంబంధించిన నిబంధనలను రెండు బ్రాంచ్‌లు వేర్వేరుగా అనుసరించవలసి ఉంటుందని గుప్తా సూచించారు.