0.54 శాతం మేర అధికంగా బాలికల ఉత్తీర్ణత
12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన బోర్డు
రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 13,04,561 మంది వెల్లడించగా, రికార్డు స్థాయిలో 99.37 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత నమోదైనట్లు సిబిఎస్‌ఇ తెలిపింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని పేర్కొంది. బాలురపై బాలికలే పైచేయి సాధించారని, 0.54 శాతం మేర బాలికలు అధికంగా ఉత్తీర్ణులైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఢిల్లీలో రికార్డు స్థాయిలో 99.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సిబిఎస్‌ఇ ప్రకటించింది. మొత్తంగా 70,004 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు సాధించగా, 1,50,152 మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మార్కులు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. కేంద్రీయ విద్యాలయాలు(కెవి), సిటిఎస్‌ఎ పాఠశాలల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొంది. గత ఏడాది (88.78 శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 10 శాతం మేర పెరిగిందని బోర్డు పేర్కొంది. మరో 65,184 మంది విద్యార్థుల ఫలితాలు వెయింటింగ్‌లో ఉన్నాయని, వారి ఫలితాలను ఆగస్టు 5న విడదుల చేయనున్నట్లు సిబిఎస్‌ఇ అధికారులు వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పరీక్షలు రద్దు చేయడంతో మెరిట్ లిస్టును ప్రకటించలేదు.సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులకు ప్రధాని అభినందనలు
సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదలైన క్రమంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. గత ఏడాది నుంచి విద్యా ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయని, వాటిని అందిపుచ్చుకొని గొప్ప ప్రదర్శన చేశారని కొనియాడారు. వారి కోసం గొప్ప భవిష్యత్తు ఎదురుచూస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఒక టాలెంట్‌కు పవర్‌హౌస్‌లుగా ప్రధాని అభివర్ణించారు.
వచ్చే వారంలో 10వ తరగతి ఫలితాలు
సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన క్రమంలో 10వ తరగతి ఫలితాలపై కసరత్తు ప్రారంభించనున్నట్లు సిబిఎస్‌ఇ పరీక్షల అధికారి సన్యామ్ భరద్వాజ్ తెలిపారు. వచ్చే వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.