మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో జంతువుల కదలికలను మరింతగా గుర్తించేందుకు వీలుగా సిసి కెమెరాలను మరిన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల పులుల, జంతువుల గణన నిర్వహించిన అటవీశాఖ.. తాజాగా జంతువులు కదలికలు పెరిగిన ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి జంతువుల కదలికలపై అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
జంతువుల కదలికలపై మరింత సమాచారం పొందేందుకు భారీగా నిధులు కేటాయిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధుల మేరకు 200 సిసి కెమెరాలను మరో కొద్దిరోజుల్లో అడవుల్లో ఏర్పాటు చేయనున్నారు. వీటితో జంతువుల కదలికలను పగలు, రాత్రివేళలలో ఫోటో తీయనున్నారు. సిసి కెమెరాలతో పాటు ఐఆర్ కెమెరాలో ఫోటోలను తీసి జంతువుల కదలికలపై స్పష్టమైన అంచనాలకు రానున్నారు. తాడ్వాయి, పాకాల, కిన్నెరసాని, అమ్రాబాద్, అదిలాబాద్, కవ్వాల్‌తో పాటు పలు అటవీ సంరక్షణ ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి జిల్లా అటవీశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్తగా వలస వచ్చే పులులతో పాటు ఇతర జంతువుల కదలికలను మరింతగా గుర్తించే వీలు అటవీ అధికారులకు కలుగనున్నంది.