అమెరికా ఇకామర్స్ సంస్థపై రూ.200 కోట్ల జరిమానా: సిసిఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ కూపన్స్‌తో 2019లో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని దేశీయ యాంటిట్రస్ట్ బాడీ సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. అంతేకాదు వాస్తవాలను దాచిందనందుకు గాను అమెరికా ఇకామర్స్ దిగ్గజం అమెజాన్‌పై రూ.200 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈమేరకు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు గత విబేధాలు ఉన్న ఫ్యూచర్ గ్రూప్‌తో అమెజాన్ న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో సిసిఐ ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న 3.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఫ్యూచర్ కూపన్‌తో డీల్ నిబంధనల పేరుతో అమెజాన్ చాలా కాలంగా రిలయన్స్‌ఫ్యూచర్ ఒప్పందాన్ని అడ్డుకుంటూ వస్తోంది. అమెజాన్ డీల్‌కు సంబంధించి వాస్తవ విషయాలను అణచివేసిందని, ఆమోదం కోరే సమయంలో తప్పుడు ప్రకటనలు చేసిందని సిసిఐ ఆర్డర్‌లో పేర్కొంది. ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు అమెజాన్‌కు రెండు వారాల సమయంలో ఇవ్వగా, తాజాగా సిసిఐ ఈ ఆదేశాలు జారీచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.