న్యూఢిల్లీ : భారత తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ చిట్ట చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్ సందర్భంగా ఆదివారంనాడిక్కడ వినిపించారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ సందేశంలో భారత దేశంలోని సాయుధ దళాల సైనికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించినందుకు విజయోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఈ యుద్ధంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఇండియా గేట్ వద్ద అనేక కార్యక్రమాలు జరుగుతాయని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపారు. మన సైనిక బలగాలు మనకు గర్వకారణమని, అందరం కలిసి విజయోత్సవాలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత దేశ సైన్యం, నావికా దళం, వాయు సేన ఉపయోగించిన ఆయుధాలు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి డిసెంబరు 12 నుంచి 14 వరకు ప్రదర్శిస్తారు.