తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదంలో సైన్యాధినేత బిపిన్ రావత్ దంపతులు, మరి 11 మంది దుర్మరణం
తీవ్ర గాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్, మృతుల్లో తెలుగు జవాన్ సాయితేజ, రాష్ట్రపతి, ప్రధాని, రక్షణమంత్రి, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభృతుల సంతాపాలు
కోయంబత్తూర్ : తమిళనాడులోని కూనూర్‌లో బుధవారం మధ్యాహ్నం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్‌రావత్(64), ఆయన భార్య మధులికసహా 13మంది చనిపోయారు. మృతుల్లో 11మంది ఆర్మీ అధికారులున్నారు. ఈ దుర్ఘటనలో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయణ్ని గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్‌గా గుర్తించారు. సింగ్‌ను వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సింగ్ శరీరం 80 శాతంమేర కాలిపోయినట్టు వైద్యులు తెలిపారు. తమిళనాడు వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ కాలేజీలోని విద్యార్థులకు ఉపన్యాసం ఇచ్చేందుకు బుధవారం ఉదయం జనరల్ బిపిన్‌రావత్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. విమానంలో రావత్‌తోపాటు ఆయన భార్య మధులిక, ఆర్మీ అధికారులున్నారు. మధ్యాహ్నం కోయంబత్తూర్ సమీపంలోని సూలూర్ వైమానిక స్థావరంలో విమానం ల్యాండైం ది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1145కు భారత వైమానిక దళాని(ఐఎఎఫ్)కి చెందిన ఎంఐ17 వి 5 హెలికాప్టర్‌లో రావత్ బృందం బయలుదేరింది.
ప్రాథమిక వార్తల ప్రకారం కోయంబత్తూర్‌కూనూర్ మధ్య మధ్యా హ్నం 1220కి హెలికాప్టర్ మంటలు విరజిమ్ముతూ నేలకూలింది. ప్రమాదం జరిగిన స్థలం రోడ్డు మార్గంలో గమ్యస్థానానికి (డిఫెన్స్ కాలేజీకి)10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. బయలుదేరిన 30 నిమిషాలకు అడవి ప్రాంతంలోని లోయలో హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదస్థలానికి సమీపంలో గిరిజనుల నివాసాలున్నాయి. మరో 10 నిమిషాల్లో డిఫెన్స్ కాలేజీకి చేరుకోనుండగా ప్రమాదం జరగడం గమనార్హం. ఓ చెట్టుకు ఢీకొని హెలికాప్టర్ కూలినట్టు స్థానికు లు చెబుతున్నారు. ప్రమాదసమయంలో పెద్ద శబ్దం వచ్చిందని,మంటలు లేచాయని వారు తెలి పారు. మంటల్లో కాలుతూనే నలుగురు వ్యక్తులు కిందికి దూకడం కనిపించిందన్నారు. సాయం త్రం 6 గంటలకు జనరల్ బిపిన్ రావత్ దంపతులుసహా 13మంది మరణించినట్టు భారత వాయుసేన అధికారికంగా ప్రకటించింది. ప్రమా దం జరిగిన సమయంలో మొత్తం 14మంది హెలికాప్టర్‌లో ఉండగా, ఒక్కరు మాత్రమే తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారు.
కేబినెట్ కమిటీ భేటీ, రెండు నిమిషాలు మౌనం
హెలికాప్టర్ ప్రమాదంలో సిడిఎస్ జనరల్ బిపిన్‌రావత్‌సహా 13 మంది చనిపోయిన నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. రావత్ గౌరవార్థం కమిటీ రెండు నిమిషాలు మౌనం పాటించింది. దేశ రక్షణ, అంతర్గత భద్రత విషయాల్లో కమిటీ నిర్ణయాలే కీలకమన్నది గమనార్హం.
నేడు ఢిల్లీకి పార్థివదేహాలు
జనరల్ బిపిన్‌రావత్ దంపతుల మృతదేహాలను సైనిక విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీకి తరలించనున్నారు. శుక్రవారం ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని వారి ఇంటికి తరలిస్తారు. అదేరోజు సాయంత్రం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రావత్ ఇద్దరు కుమార్తెలు, చెల్లెలు, సోదరుడు, కుటుంబసభ్యులు అంత్యక్రియల్లో పాల్గొంటారు.