Friday, February 21, 2025

గాజా.. ఊపిరి పీల్చుకో !

- Advertisement -
- Advertisement -

 ఎట్టకేలకు అమల్లోకి ఇజ్రాయెల్,
హమాస్ కాల్పుల విరమణ
ఒప్పందం అమలుకు మూడు
గంటలు ఆలస్యం ముగ్గురు
మహిళా బందీలను విడుదల చేసిన
హమాస్ ఇజ్రాయెల్ చెరలో
ఉన్న వందలాది మంది
పాలస్తీనియన్లకు త్వరలో విముక్తి

దెయిర్ అల్‌బలాహ్ (గాజా స్ట్రిప్) : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం ఎట్టకేలకు గాజా స్ట్రిప్‌లో అమలులోకి వచ్చింది. ఆదిలో ఆరు వారాల పాటు ప్రశాంతత నెలకొంటుందని, తీవ్రవాదుల చెరలోని డజన్ల కొద్దీ బందీల విడుదల జరుగుతుందని, విధ్వంసకరమైన 15 మాసాల పోరు ముగుస్తుందని ఆశలు రేకెత్తుతున్నాయి. హమాస్ చివరి క్షణంలో ఆలస్యంచేయడంతో కాల్పుల విరమణ ఆరంభం సుమారు మూడు గంటలు వాయిదా పడింది. దీనితో ఆ ఒప్పందం ఎంత బలహీనమైనదో తేలింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం అధికారికంగా అమలులోకి రావడానికి ముందే యుద్ధం వల్ల దెబ్బ తిన్న ప్రాంతంలో వేడుకలు మొదలయ్యాయి.

కొంత మంది పాలస్తీనియన్లు తమ ఇళ్లకి తిరిగి రాసాగారు. ఇది ఇలా ఉండగా, డజన్ల కొద్దీ పాలస్తీనా ఖైదీల విడుదలతో మార్పిడి కింద స్వదేశానికి తిరిగి రావచ్చని భావిస్తున్న మొదటి బృందం బందీల పేర్లను ఇజ్రాయెల్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.15 గంటలు మొదలైన కాల్పుల విరమణ యుద్ధం ముగింపునకు, 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడిలో అపహరించిన సుమారు వంద మంది బందీలు తిరిగి రావడానికి దారి తీసే తొలి చర్యగా భావిస్తున్నారు. రోమి గోనెన్ (24), ఎమిలీ దమారి (28), దొరోన్ స్టీన్‌బ్రెచర్ (31) విడుదల కానున్నారని ఇజ్రాయెల్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. గోనెన్‌ను నోవా సంగీత ఉత్సవంలో నుంచి అపహరించగా, తక్కిన ఇద్దరినీ కిడ్‌బట్జ్ కఫర్ అజా నుంచి కిడ్నాప్ చేశారు. దమారి ఇజ్రాయెల్ బ్రిటిష్ ద్వంద్వ పౌరురాలు.

cease fire closed in Gaza

నిబంధనలకు అనుగుణంగా తన పేరు వెల్లడి చేయరాదన్న షరతుతో మాట్లాడిన అధికారి బందీల పేర్ల ప్రచురణకు కుటుంబాలు అంగీకరించాయని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి ముందు మూడు పేర్లను హమాస్ అందజేయవలసి ఉంది. తీవ్రవాదులు తమ వాగ్దానానికి కట్టుబడలేదని, వారు ఆ పని చేసేంత వరకు ఇజ్రాయెల్ మిలిటరీ పోరాడుతూనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతకుముందు చెప్పారు. దాదాపు రెండు గంటల తరువాత ఆ పేర్లను హమాస్ ఎట్టకేలకు విడుదల చేసింది. సాంకేతిక కారణాలతోనే ఆలస్యం అయిందని తెలియజేసిన హమాస్ ఒప్పందానికి తాము ఇప్పటికీ నిబద్ధమై ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఉదయం 8.30 గంటలకు, కాల్పుల విరమణ ప్రారంభం కావడానికి మధ్య వ్యవధిలో ఇజ్రాయెలీ కాల్పుల్లో కనీసం 26 మంది హతులయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే, వారు పౌరులా లేక యోధులా అన్నది మంత్రిత్వశాఖ తెలియజేయలేదు. ప్రజలు బఫర్ జోన్‌లోకి వెళుతుండగా, ఇజ్రాయెలీ దళాలకు దూరంగా ఉండాలని మిలిటరీ వారిని హెచ్చరించింది. ఇది ఇలా ఉండగా, కాల్పుల విరమణ ఒప్పందం పట్ల నిరసనసూచకంగా తమ యూదుల వర్గం ప్రభుత్వంలో నుంచి నిష్క్రమిస్తున్నదని ఇజ్రాయెల్ ఛాందసవాద జాతీయ భద్రత శాఖ మంత్రి ప్రకటించారు. అయితే, ఇతామర్ బెన్‌గ్విర్ నిష్క్రమణ వల్ల నెతన్యాహు సంకీర్ణం బలహీనపడవచ్చు కానీ శాంతికి భంగం కలగదు. కాగా, 2014 ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో హతుడైన జవాన్ ఓరాన్ షాల్ మృతదేహాన్ని గాజాలో ప్రత్యేక ఆపరేషన్‌లో తాము స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ విడిగా ప్రకటించింది.

షాల్, మరొక జవాన్ హదర్ గోల్డిన్ మృతదేహాలు 2014 యుద్ధం తరువాత గాజాలోనే ఉండిపోయాయి. ప్రజల ఉద్యమం చేసినప్పటికీ వాటిని వారి కుటుంబాలకు తిరిగి అందజేయలేదు. యునైటెడ్ స్టేట్స్, ఖతార్, ఈజిప్ట్ ఏడాది పాటు ముమ్మరంగా మధ్యవర్తిత్వం సాగించిన తరువాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని క్రితం వారం ప్రకటించారు. కాల్పుల విరమణ కాలం తొలి దశ 42 రోజుల్లో మొత్తం 33 మంది బందీలు గాజా నుంచి తిరిగి రావలసి ఉండగా, వందలాది మంది పాలస్తీనియన్లు, నిర్బంధితులు విడుదల కావలసి ఉంది. ఇజ్రాయెలీ దళాలు గాజా లోపల బఫర్ జోన్‌లోకి ఉపసంహరించుకోవలసిఉంది. నిర్వాసిత పాలస్తీనియన్లు అనేక మంది ఇళ్లకు తిరిగి చేరుకోవలసి ఉంది. యుద్ధంలో విధ్వంసమైన ఆ ప్రాంతంలో మానవతావాద సహాయం సరఫరా జరగవలసి ఉంది. యుద్ధంలో ఇది కేవలం రెండవ కాల్పుల విరమణ ఒప్పందం. 2023 నవంబర్‌లో వారంపాటు కాల్పుల విరమణ పాటించడమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News