న్యూఢిల్లీ : యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నోటీసులు పంపించడంపై ఆప్ అధినేత కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను నాశనం చేశారని ధ్వజమెత్తారు. రాజీవ్‌కుమార్‌లా ఎవరూ ఎన్నికల కమిషన్‌ను నష్టపర్చలేదన్నారు. ఆయనకు ఆసక్తి ఉంటే ఢిల్లీ అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చని వ్యాఖ్యానించారు. “తాను బతికి ఉన్నంతవరకు ఢిల్లీ ప్రజలు విషపూరిత జలాలను తాగనివ్వబోను.
రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసు. దానికి నేను భయపడను” అని పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. ఎన్నికల కమిషన్ నోటీసుకు బుధవారం కేజ్రీవాల్ స్పందిస్తూ హర్యానా నుంచి ఇటీవల తీసుకొచ్చిన నీళ్లు పూర్తిగా విషపూరితమని తేలిందని ఆరోపించారు. అలాంటి విషజలాలను ప్రజలు తాగితే తీవ్ర అనారోగ్యం పాలవుతారని, అంతేకాక ప్రాణాలు కోల్పోతారని తాను ఎన్నికల కమిషన్‌కు పంపిన 14 పేజీల సమాధానంలో వివరించారు. కేజ్రీవాల్ పంపిన లేఖపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ కేజ్రీవాల్ సమాధానం ఈ అంశంపై పూర్తిగా మౌనంగా ఉందన్నారు.