కేంద్ర న్యాయమంత్రికి సిఇసి లేఖ
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ఒక వ్యక్తి ఒక సీటు ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఎన్నికలలో ఏకకాలంలో ఒక వ్యక్తి కేవలం ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా పరిమితిని విధించాలని ఈ మేరకు శాసనం తీసుకురావాలని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ (సిఇసి) హోదాలో ఉన్న రాజీవ్ కుమార్ సంబంధిత అంశంపై లేఖను కేంద్రానికి పంపించారు. ఎన్నికల సంస్కరణలు, ప్రక్రియలో వ్యయ భారం తగ్గింపు చర్యలలో భాగంగా సిఇసి ఈ లేఖను తక్షణ అంశంగా నివేదించారు.
ఎన్నికలలో పోటీకి దిగే అభ్యర్థులు ప్రత్యేకించి ప్రముఖ నేతలు పలు కారణాలతో ఒకటికి మించి నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రెండింటిలో గెలిస్తే ఒకదానిని వదులుకోవడం, అక్కడ తిరిగి రీపోలింగ్ జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నిర్ణయాత్మకతకు కూడా ఇది సవాలు విసురుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసీటు ఒక్క వ్యక్తి నినాదం ముందుకు వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూకు సిఇసి పంపిన లేఖలో ఇప్పటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని అంశాలు ఎన్నికల సంస్కరణలకు ఏ విధంగా అడ్డు వస్తున్నాయనే విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే 284 నమోదిత, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు (రూప్) షాక్ ఇచ్చింది. వీటిని డిలిస్ట్ చేసింది. పార్టీలను నమోదు చేయడం అవి గుర్తింపు పొందకుండానే నిధుల సమీకరణకు దిగడం ఇది చివరికి మనీలాండరింగ్ వ్యవహారాలకు దారితీయడం వంటి అంశాలు వివాదాస్పదం అయిన దశలో సిఇసి స్పందించింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఎన్నిక ప్రతిపాదన తెచ్చింది.