నిజామాబాద్ సిటీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపచేశారు. జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదికయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మహాకవి దాశరథి చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగానివాళులర్పించి సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ దాదన్నగారి విఠల్‌రావు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టిఎన్‌జిఓల సంఘ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ప్రముఖ కవులు త్రివేణి, నరాల సుధాకర్, పివి చందన్‌రావు, తదితరులు సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. న్యూ అంబేద్కర్ భవన్‌లో జాతీయ గీతాలాపన, జ్యోతి ప్రజ్వళతో కవి సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
జడ్పీ ఛైర్మన్ సూచనల మేరకు ములుగు జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆకస్మిక మరణంపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ కొద్దిసేపు మౌనంపాటించి సంతాపం తెలియచేశారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన సాహితీవేత్తలు తమ సందర్భోచిత కవితా వచనాలతో ఈ కార్యక్రమానికి వన్నెలద్దారు. ఒకరికొకరు ధీటుగా అక్షర విన్యాసాలు, పదబంధాలను ప్రయోగిస్తూ పద్య, వచ కవిత్వాలతో సాహిత్యాభిమానుల మన్ననలందుకున్నారు ఉదయం ప్రారంభమైన ఈ కవితా సమ్మేళనం సా యంత్రం ముషాయిరాతో ఘనంగా ముగిసింది. కవుల కవితాఝరి అలుపెరగని ప్రవాహంలా కొనసాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని, ఉద్యమ కాలంనాటి పరిస్థితులు, తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన అద్వితీయ ప్రగతి గురించితమ కవితల ద్వారా హృద్యంగా ఆవిష్కరించారు. కవి సమ్మేళనం కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ అందరిని అలరింపజేసింది.
తెలంగాణ ప్రాశస్తం, ఉద్యమ ప్రస్తానంలో నిజామాబాద్ గడ్డ పోషించిన పాత్ర, సాహితీ లోకంలో ఈ ప్రాంతానికి గల ప్రత్యేకత గురించి కవులు తమదైన శైలిలో కవితాత్మకత రూపంలో అభివర్ణించారు. ప్రస్తుత సమాజంలో సాహితీ రంగంలో పోషిస్తున్న పాత్ర గురించి విడమరిచి చెప్పారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మాట్లాడుతూ కత్తి కంటే కలం ఎంతో గొప్పది కవులు తమ చరనల ద్వారా అనేక సందర్భాల్లో నిరూపిస్తున్నారని అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు మాట్లాడుతూ మహాకవి దాశరథి నిజామాబాద్ వాస్తవ్యులు కానప్పటికీ ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఏర్పడిందన్నారు. దాశరథిని నిర్బంధించిన నిజామాబాద్ ఖిల్లా జైలు గోడలపైన ఆయన రాసిన కవిత్వాలు ఎంతోమందిని ఉత్తేజపరిచాయని అన్నారు. సాహిత్యాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లిన గొప్ప కవి అని కొనియాడారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాహిత్య దినోత్సవ కార్యక్రమానికి కవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయడం సంతోషం కలిగించిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, రచయితలను గౌరవించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కవుల సాహిత్యానికి ప్రజా ఉద్యమాలతో ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. వారి ఆటపాటలు ఎన్నో పోరాటాలకు ఊతమిచ్చాయని, సబ్బండవర్ణాలను ఏకతాటిపైకి తెచ్చాయని ఉద్యమ ఉధృతికి బాటలు వేశారని కొనియాడారు. ఈసందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఙాపిక రూ.1116 నగదు పారితోషికంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ సింహాచలం, బాలభవన్ పర్యవేక్షకులు ప్రభాకర్, కవి సమ్మేళనం నిర్వాహక కమిటీ సభ్యులు గంట్యాల ప్రసాద్, డా.వి.త్రివేణి, తిరుమల శ్రీనివాస్ ఆర్య, మద్దుకూరి సాయిబాబు, అధిక సంఖ్యలో కవులు, సాహితీవేత్తలు, అభిమానులు పాల్గొన్నారు.