కాల్పుల్లో దోస్తు జవాన్ మరణం
బ్రహ్మ్‌నగర్ (పంజాబ్) : ఒకడి పెళ్లి మరొకడి చావుకొచ్చింది. పెళ్లి వేడుకలో భాగంగా బారాత్ జరుగుతూ ఉండగా కొత్త పెళ్లికొడుకు మనీష్ మధేషియా అలంకరించిన రథంపై ఉండి ఉత్సాహంగా లేచి నిలబడి చేతులో ఉన్న రివాల్వర్ తీసుకుని కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్ వెళ్లి ఆయన స్నేహితుడు ఆర్మీ జవాను అయిన బాబూలాల్ యాదవ్‌ను తాకింది. కుప్పకూలిన యాదవ్‌ను ఆసుపత్రికి తరలించగా ఆ తరువాత చనిపోయాడని సోన్‌భద్ర జిల్లా ఎస్‌పి అమరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. పెళ్లి కొడుకు చేతిలోని రివాల్వర్ యాదవ్‌ది. చూడముచ్చటగా ఉంటుందని వేడుకులో మజా వస్తుందని పెళ్లికొడుకు చేతికి తన సర్వీసు గన్ ఇచ్చాడు. తన గన్ చివరికి ఆయనను బలి తీసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో వరుడిని పోలీసులు అరెస్టు చేసి తరలించారు. ఉత్సవాలు, బారాత్‌లలో లైసెన్సులు ఉన్న గన్స్‌తో కాల్పులకు దిగడం దేశంలో శిక్షార్హమైన నేరం అవుతుంది. పెళ్లి బారాత్‌లోనే యాదవ్ కింద పడిపోయినప్పుడు చాలా సేపటివరకూ ఏం జరిగిందనేది ఎవరికి తెలియలేదు. ప్రత్యర్థులు ఎవరో చంపివేసి ఉంటారని భావించారు. అయితే అక్కడి సిసి కెమరాలను పరిశీలించగా వరుడే కాల్పులు జరిపి యాదవ్ మరణానికి కారణమైనట్ల గుర్తించారు.