హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తన తెలంగాణ పర్యటనలో రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లను కలిసి తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అదే దారిలో పయనిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన.. పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు. టాలీవుడ్ హీరో నితిన్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ తో పాటు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు నడ్డాతో భేటీ కానున్నారు. మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర రావు కూడా నడ్డాతో భేటీ అవుతున్నారు.
బిజెపి జాతీయ నేతలు రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ఇలా ఆయా రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ కావడం చర్చకు దారితీస్తోంది. ఈ భేటీల్లో రాజకీయ అంశాల కంటే స్థానిక పరిస్థితులను ఇలా తటస్థులతో చర్చించి ఆరా తీయడమే జాతీయ నేతల ఉద్దేశంగా కనిపిస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం వీళ్లు భేటీ అయ్యారంటే బిజెపిలో చేరిపోతున్నారనే చర్చ జరుగుతుంది. బిజెపి నేతలకు కావాల్సింది కూడా ఇదే అవసరం కావడం. కానీ మీటింగ్స్ లో మాత్రం జరుగుతున్నది వేరనే సమాచారం తెలుస్తుంది.