Friday, November 15, 2024

కృష్ణంరాజు మృతిపై ప్రముఖుల నివాళులు…

- Advertisement -
- Advertisement -

Celebs pay tribute to Demise of Krishnam Raju

కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆయన పార్థీవ దేహాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి తరలించాక కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస యాదవ్, మాజీ సిఎం చంద్రబాబు సహా పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలు, సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, మంచు విష్ణు, అశ్వనీదత్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, దిల్‌రాజు, మురళీమోహన్, మోహన్ బాబు, త్రివిక్రమ్, కె.రాఘవేంద్రరావు, బి.గోపాల్, జయసుధ, కవిత, జీవిత తదితరులు కృష్ణంరాజుకు పూలతో నివాళులర్పించారు. అనంతరం వీరంతా ప్రభాస్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి తలసాని ఓదారుస్తుండగా ప్రభాస్ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. తాను పెద్ద దిక్కును కోల్పోయానని ప్రభాస్ బాధపడగా తలసాని ఓదార్చారు. ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరావు లేని లోటును తీర్చారు పెదనాన్న కృష్ణంరాజు.
కృష్ణంరాజు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ “తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి” అని అన్నారు. ప్రముఖ సినీ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ “కటకటాల రుద్రయ్య, మన ఊరి పాండవులు, భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు వంటి అనేక గొప్ప చిత్రాలలో నటించి కృష్ణంరాజు అనేకమంది అభిమానుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు” అని అన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “విలక్షణ నటనతో కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ ఆయన సేవలందించారు”అని చెప్పారు.
సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. “కృష్ణంరాజుతో 50 సంవత్సరాల స్నేహం నాది. మా కాంబినేషన్‌లో వచ్చిన ఇంద్రభవనం, యుద్ధం, అడవి సింహాలు తదితర సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఆయన ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లడం చాలా బాధగా ఉంది” అని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “కృష్ణంరాజుఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజుతో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన రెబల్ స్టార్‌కి నిజమైన నిర్వచనం” అని అన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా నిర్మాతగా రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది”అని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో ఆయనది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు. ఆయనతో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం”అని తెలిపారు. మహేష్‌బాబు మాట్లాడుతూ “కృష్ణంరాజు ఇక లేరని తెలిసి షాక్ అయ్యాను. నాకు, మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు ఇది. ఆయన జీవితం.. ఆయన చేసిన పని.. సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి”అని అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “కృష్ణంరాజు మరణ వార్త తెలియగానే ఎంతో బాధపడ్డాను. తెలుగు ఇండస్ట్రీకి ఆయన మరణం తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగంపై ఆయన తనదైన ముద్ర వేశారు”అని చెప్పారు. జయసుధ మాట్లాడుతూ “మేము ఇద్దరం కలిసి నటించిన మొదటి సినిమా నుండి మేము మంచి స్నేహితులం. నన్ను ఎంతో అభిమానంతో, ఆప్యాయతో పలకరిస్తూ ఉండేవారు కృష్ణంరాజు. ఆయన స్థాపించిన సంస్థ గోపి కృష్ణ మూవీస్ లో కూడా నేను ఎక్కువ సినిమాలు చెయ్యడం వల్ల కూడా నేను అంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు. నేను ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను” అని చెప్పారు.

Celebs pay tribute to Demise of Krishnam Raju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News