Monday, January 20, 2025

భారతీయులందరు గర్వపడేలా చేశారు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ పై సెలబ్రిటీల ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో పలువురు టాలీవుడ్ స్టార్లు చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ “ఆస్కార్ అవార్డును గెలుపొందిన తొలి తెలుగు సినిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ నిలవడం అద్భుతంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన నటులు రామ్‌చరణ్, తారక్‌లకు నా సెల్యూట్. ఈ పురస్కారాన్ని గెలుపొందడానికి ఎస్‌ఎస్.రాజమౌళే కారణం. ఆయన భారతీయులందరు గర్వపడేలా చేశారు. షార్ట్ ఫిలిం కేటగిరిలో అవార్డును గెలుపొందిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ టీమ్‌కు కూడా నా శుభాకాంక్షలు. మీరందరు చరిత్రను సృష్టించారు. జై హింద్‌” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

“తెలుగు జాతి, భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా తెలుగు సినిమా చూసేలా చేసినా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సభ్యులు నిజమైన బాహుబలులు. ఎక్కడో పుట్టి, ఇక్కడే పెరిగి ఆస్కార్ సాధించిన కీరవాణి.. నీ చేతిలో ఉన్నా ట్రోఫీ నా చేతిలో ఉన్నంతా ఆనందంగా ఉంది. పొట్టివాడు, గట్టివాడు అన్న సామెతను నిజం చేసినా చంద్రబోస్.. నిన్ను నిజంగా శభాష్ చంద్రబోస్ అని పొగడాలని ఉంది. రాజమౌళి దర్శకత్వం, ఇద్దరు హీరోల ఆట, డ్యాన్స్ మాస్టర్ కంపోజింగ్ ఈ సినిమాకు హైలైట్స్ అని ప్రపంచమంతా గుర్తించింది. అందరికి హ్యాట్సప్‌” అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు.

గ్లోబల్ స్టార్ ప్రభాస్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. “ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ సినిమాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ ను చరిత్ర గుర్తుంచుకుంటుంది. భారీ విజయం సాధించినందుకు చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు” అని ప్రభాస్ పేర్కొన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.“నాటు నాటు… అన్ని సరిహద్దులను చెరిపేసింది. ఆస్కార్ అవార్డును గెలుపొందినందుకు కీరవాణి, చంద్రబోస్‌తో పాటు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. భారతీయ సినిమా గర్వంగా తలెత్తుకునే క్షణమిది. నాకు సంతోషంతో పాటు గర్వంగా ఉంది” అని మహేష్ బాబు చెప్పారు.

నందమూరి బాలకృష్ణ ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ “ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి నా హృదయ పూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వంచదగిన విజయమిది. స్వరకర్త కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్‌కి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి నా అభినందనలు” అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

నిర్మాతల మండలి అభినందనలు…
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అభినందనలు తెలియజేసింది. “తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన రోజు 12 మార్చి 2023. అమెరికాలో జరిగిన 95వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో తెలుగు సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు – నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారం రావడం తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా భారతదేశం మొత్తం సినిమా పరిశ్రమకు గర్వకారణం. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరుపున ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా డివివి దానయ్య, దర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళి, సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ఈ పాటలో అద్భుతమైన డాన్స్ చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ , డాన్స్ కు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్క్ష్రిత్, సినిమాకు పని చేసిన మొత్తం టీమ్‌కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము”అని నిర్మాతల మండలి పేర్కొంది.

భావోద్వేగానికి గురైన రాజమౌళి…
ఆస్కార్ అవార్డును అందుకున్న తర్వాత ఆ ఆనందంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాటలు మాట్లాడుతూనే పాట రూపంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచారు. “ప్రతి భారతీయుడు గర్వించేలా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు ఆస్కార్ అందుకోవాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆస్కార్ అవార్డు అందుకున్నాను. ఈ అవార్డు నన్ను ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచింది”అని అన్నారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని నాటు నాటు… సాంగ్ ఆస్కార్ గెలుచుకున్నట్టు హోస్టు ప్రకటించడంతో రాజమౌళి తన ఆనందాన్ని పట్టలేక పోయారు. ఈ క్రమంలో రాజమౌళి చుట్టూ ఉన్న వారు లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. కీరవాణి వేదికపైకి చేరుకుని ప్రసంగం ప్రారంభించే సమయానికి శ్రీవల్లి… రాజమౌళి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. ఆపై ఇద్దరిని కలిసి రమా రాజమౌళి కూడా వచ్చి హత్తుకుంది. ఈ ఆనందంలో ముగ్గురి కళ్ల నుండి కన్నీళ్లు వచ్చేశాయి. ఇక అవార్డు ప్రకటించిన వెంటనే చరణ్ కూడా శ్రీవల్లిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని షేర్ చేశారు ఆమె ‘ది అకాడమీ’ అవార్డుల వేడుక నుండి మరిన్ని కీలకమైన మూమెంట్స్‌ను కూడా షేర్ చేసింది. ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ “ మా సినిమా పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రకటించడంతో ఇది నిజమేనా అని నాకు అనిపించింది. అయితే ముందు నుంచి ఈ అవార్డు వస్తుందని మేం భావించాం. అదేవిధంగా జరిగింది. అలాగే సాంగ్ పర్ఫామ్ చేసిన సమయంలో ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది”అని అన్నారు.

అరుదైన రత్నాలు…
ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రామ్ చరణ్ అయితే ఒక సుదీర్ఘ లేఖ రాశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ అనేది ఎప్పటికీ ఇండియన్ సినిమా హిస్టరీలో స్పెషల్ సినిమాగా నిలిచిపోతుందని… మన జీవితాల్లో కూడా అది పెనమేసుకుపోయిందని చెప్పుకొచ్చారు. ఇదంతా ఒక కలలా అనిపిస్తోందని అన్నారు. ఎస్‌ఎస్ రాజమౌళి, కీరవాణి తెలుగు సినీ పరిశ్రమకు మాత్రమే కాదు… ఇండియన్ సినీ పరిశ్రమకు దొరికిన అరుదైన రత్నాలు లాంటివారని పేర్కొన్నారు. గీత రచయిత చంద్రబోస్, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌లకు థాంక్స్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్‌కు కూడా థాంక్స్ చెబుతూ ‘సోదరా మనం మళ్ళీ కలిసి డ్యాన్స్ చేస్తాం… చేసి మరిన్ని రికార్డులు బద్దలు కొడతామని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదే విధంగా ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేస్తూ మనం సాధించామని అన్నారు.

పులి బొమ్మ డ్రెస్‌తో తారక్ సందడి…
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ వేదిక మీద రెడ్ కార్పెట్ మీద నడిచేందుకు స్పెషల్‌గా ఒక పులి బొమ్మతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక సూట్ ధరించారు. ఆ పులి బొమ్మ కరెక్ట్ గా ఎన్టీఆర్ భుజం మీదకు వచ్చి డ్రెస్ మొత్తాన్ని హైలైట్ అయ్యేలా చేసింది. ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకర్స్‌లో ఒకరు ఈ పులి బొమ్మ ఎందుకు వేసుకొచ్చారు? అని అడిగితే… దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. “ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో పులిని చూశారు కదా… నాతో పాటు అది కూడా కనిపించింది. నిజానికి పులి మా ఇండియన్ నేషనల్ యనిమల్. నేను మా దేశ జాతీయ జంతువు బొమ్మను ధరించి రెడ్ కార్పెట్ మీద నడవడంతో నాకెంతో గర్వంగా ఉంది”అని ఎన్టీఆర్ చెప్పడం అక్కడ ఉన్న వారందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News