Monday, January 20, 2025

వర్ష కాలం ముగిసే వరకు సెల్లార్ తవ్వకాలు బంద్:జిహెచ్‌ఎంసి

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః వర్ష కాల ముందస్తూ ప్రణాళికలో భాగంగా జిహెచ్‌ఎంసి సెల్లార్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. వర్షకాలానికి మరో నెల రోజులు మాత్రమే ఉండడంతో సెల్లర్ తవ్వకాలు, నిర్మాణాలకు సంబంధించి మార్గ దర్శకాలను జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ జారీ చేశారు. జూన్ నుంచి వర్షా కాలం ముగిసే వరకు కొత్తగా సెలార్ల తవ్వకాలకు ఏలాంటి అనుమతులు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ యజమానులు, నిర్మాణ సంస్థలు నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచించారు. ఇందులో భాగంగా శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలతో పాటు జిహెచ్‌ఎంసి పరిధిలో సెల్లార్ల తవ్వకాలు, నిర్మాణాలకు సంబంధించి ముందస్తు చర్యలను తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

సెల్లార్ నిర్మాణం, సెట్ బ్యాక్ మంజూరు చేసిన ప్లాన్ ప్రకారం చేపట్టారా అనే అంశాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. అదేవిధంగా నిర్మాణానికి సంబంధిచి అవసరమైన ప్రామాణిక భద్రతా చర్యలను తీకోకపోతే తక్షణ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సెల్లార్ నిర్మాణంలో భాగంగా నేల స్వభావం బలోపేత నిర్మాణాన్ని పరిక్షించాలని సూచించారు. నిబంధలకు విరుద్దుంగా నిర్మాణాలను చేపడితే వెంటనే అనుమతులను రద్దు చేయడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంతకు ముందే సెల్లార్ తవ్వకాలు జరిపి వాటిని అసంపూర్తిగా నిలిపివేస్తే సిండ్ డి వేస్ట్ మేనేజ్‌మెంట్ వింగ్ సహాయంతో దానిని పూర్తి పూడ్చివేయాలని సూచించారు. అదేవిధంగా సెల్లార్ తవ్వకాలకు సంబంధించి మెత్తని నేల గాని, రాయి ప్రాంతమైతే దానిని తొలగించే క్రమంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోనేలా నోటీసులను జారీ చేయాలన్నారు.

అదేవిధంగా సెల్లార్ నిర్మాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు ఎదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందా అనే కోణంలో పరిశీలించి అవకాశాలుంటే సంబంధింత డిప్యూటీ కమిషనర్ మార్గదర్శకత్వంలో స్థానిక పోలీసుల సహాయంతో చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా లేబర్ క్యాంపుల భద్రతను తనిఖీ చేయడంతోపాటు అవి సెల్లార్‌ను ఆనుకుని ఉంటే బిల్డర్ భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించాలన్నారు. సెల్లార్లకు సంబంధించి విడుదల చేసిన మార్గ దర్శకాలపై అన్ని సర్కిళ్లలో సిటి ప్లానర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్లు వెంటనే తనిఖీలు చేపట్టి ఇందుకు సంబంధించి సమగ్రమైన నివేదిక అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. విధుల్లో ఎవరూ నిర్లక్షం వహించినా శాఖపరమైన చర్యల తప్పవని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News