ఫోన్..ఈ రోజుల్లో మనిషికి నిత్యవసర వస్తువుగా మారింది. ఒకప్పుడు ఫోన్ కేవలం మాట్లాడడానికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్‌లోనే ఉంటోంది. ఆర్థిక లావాదేవీలు సైతం ఫోన్‌తోనే జరుగుతున్నాయి. దీంతో రోజురోజుకు ఫోన్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో టెలీ సాంద్రత నానాటికీ పెరిగిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో మొబైల్ ఫోన్ల సంఖ్య జనాభాను మించిపోయినట్లు ట్రాయ్ నివేదిక 2024 స్పష్టం చేసింది. ప్రతి వంద మందికి 105కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయని, దేశ సగటు 82 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. వైర్ లైస్ టెలీడెన్సిటీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు కోట్లకు పైగా మొబైల్ ఫోన్లు, మరో 15 లక్షలకు పైగా ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. రాష్ట్రంలో మూడు కోట్ల 64 లక్షలకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.
మొత్తం ఫోన్ల సంఖ్య 4 కోట్ల పైనే : రాష్ట్రంలో మొబైల్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం జనాభా కం అధికంగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక ముఖ చిత్రం 2025లో సంబంధించిన వివరాలను పొందుపరిచారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా – ట్రాయ్ 2024 సెప్టెంబర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 4 కోట్ల 19 లక్షల 40 వేలు. అందులో 96.38 శాతం అం 4 కోట్ల 4 లక్షల 20 వేలు మొబైల్ ఫోన్లు, 15 లక్షల 25 వేల ల్యాండ్ లైన్ ఫోన్లు 3.62 శాతంగా ఉన్నాయి.
96 శాతం పట్టణ ప్రాంతాల్లోనే : రాష్ట్రంలోని టెలిఫోన్ వినియోగదారుల్లో 60 శాతానికి పైగా పట్టణ ప్రాంతాల్లో, 39 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మొబైల్ ఫోన్లకు సంబంధించి చూస్తే పట్టణ ప్రాంతాల్లో 59 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం వినియోగదారులు ఉన్నారు. ల్యాండ్ లైన్ వినియోగదారుల్లో 96 శాతం పట్టణ ప్రాంతాల్లో ఉండగా కేవలం నాలుగు శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. ట్రాయ్ నివేదిక 2024 ప్రకారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్ లైస్ టెలీడెన్సిటీ 105.32 గా ఉంది.
దేశంలోనే 4వ స్థానంలో తెలంగాణ : రాష్ట్రంలో సగటున ప్రతి వంద మందికి 105కు పైగా మైబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలో ప్రతి వంద మందికి సగటున 82.07 శాతం మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ అంశంలో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. గోవా 152, కేరళ 115, హర్యానా 114 శాతంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 104 శాతంతో పంజాబ్ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 78.93 శాతంతో ఉంది.
3 కోట్ల 64 లక్షల ఇంటర్నెట్ వినియోగదారులు : రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 3 కోట్ల 64 లక్షల 30 వేలుగా ఉంది. ఇందులో 97.92 శాతం బ్రాడ్ బ్యాండ్ సదుపాయం ఉండగా కేవలం రెండు శాతం మాత్రమే నారో బ్యాండ్ సదుపాయం ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో పట్టణ ప్రాంతాల్లో 63.74 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 36.26 శాతం మంది ఉన్నారని నివేదిక తెలిపింది. చాలా మంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగిస్తారు ఒకటి వ్యక్తిగత వినియోగం కోసం, మరొకటి వ్యాపారం లేదా ఇంటర్నెట్ కోసం. ఇది మొబైల్ కనెక్షన్ల సంఖ్యను పెంచుతోంది. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో, ఇంటర్నెట్ వినియోగం చాలా ఎక్కువ. దీని కోసం చాలా మంది డేటా సిమ్‌లను అదనంగా కొనుగోలు చేస్తారు. ఐటీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌లో వ్యాపార సంస్థలు, కంపెనీలు ఉద్యోగుల కోసం బహుళ కనెక్షన్లను నిర్వహిస్తాయి. జనాభాలో కొంత శాతం (పిల్లలు, వృద్ధులు) ఫోన్‌లను ఉపయోగించకపోయినా, కనెక్షన్ల సంఖ్య వారిని కూడా మించిపోతుంది.
5 కోట్లకు చేరే అవకాశం : ఈ ట్రెండ్ కొనసాగితే, తెలంగాణలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 5 కోట్లకు చేరవచ్చు. అదే సమయంలో జనాభా 4 కోట్ల లోపే ఉండవచ్చు. ఇది జనాభా కంటే ఫోన్ సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయనే వాస్తవాన్ని బలపరుస్తుంది. ఈ ధోరణి భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది, కానీ తెలంగాణలో ఐటీ రంగం, అధిక అక్షరాస్యత (66.46శాతం – 2011, ఇప్పుడు మరింత పెరిగి ఉండవచ్చు) దీనిని మరింత ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోనే తొమ్మిదో టెలీ సాంద్రత గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 4.08 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులున్నారు. అందులో 98 శాతం మంది వైర్‌లెస్ (మొబైల్) వినియోగదారులే. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 2.37 కోట్ల మంది టెలిఫోన్ వినియోగదారులు ఉండగా అందులో 96 శాతం మంది వైర్‌లెస్ ఫోన్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విషయానికి వస్తే 1.70 కోట్ల మంది టెలిఫోన్ వాడుతుంటే అందులో 99.8 శాతం మందివి వైర్‌లెస్ ఫోన్లే.
విశేషమేమిటంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే సగటున మొబైల్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక, మొబైల్ కనెక్షన్ల విషయంలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలవగా, దేశంలో 9వ స్థానంలో నిలిచింది. ప్రతి 100 మంది జనాభాకు తెలంగాణలో 105 మొబైల్ కనెక్షన్లుండడం విశేషం. తెలంగాణలో జనాభా కంటే మొబైల్ ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది ఆధునిక టెక్నాలజీ వినియోగం, రాష్ట్రంలోని కనెక్టివిటీ స్థాయిని సూచిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా సుమారు 3.50 కోట్లు (35 మిలియన్లు)గా ఉంది. అయితే, 2025 నాటికి ఈ సంఖ్య కొంత పెరిగి 3.77 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేయవచ్చు, ఎందుకంటే రాష్ట్ర జనాభా దశాబ్ద వృద్ధి రేటు 13.58 శాతం గా ఉంది. మొబైల్ ఫోన్ సంఖ్యల విషయానికొస్తే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా (2024 వరకు అందుబాటులో ఉన్న సమాచారం) ప్రకారం, తెలంగాణలో యాక్టివ్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య జనాభా కంటే ఎక్కువగా ఉంది. 2023 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 4.5 కోట్లకు పైగా మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది జనాభా కంటే సుమారు 20-25 శాతం ఎక్కువ.