బస్తా సిమెంట్ రూ.50 పెరగనుందనే అంచనాలు
భారం కానున్న ఇంటి నిర్మాణాలు
న్యూఢిల్లీ : ఇప్పటికే బ్యాంకులు ఇఎంఐల రేట్లను పెంచిన వార్తలతో సతమవుతున్న గృహ కొనుగోలుదారులకు ఇప్పుడు మరో భారం వచ్చిపడింది. అదే సిమెంట్ బస్తా రేట్లు పెరుగుతాయనే అంచనాలు. అవును త్వరలో సిమెంట్ రేట్లు పెరగుతాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా సిమెంట్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇల్లు నిర్మించడం కూడా ఖర్చుతో కూడుకున్నది. ఏప్రిల్ నెలలో సిమెంట్ ధర పెరగవచ్చు. దీనిపై క్రిసిల్ తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తయారీదారులు ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై మోపడం ప్రారంభించారని నివేదిక పేర్కొంది. దేశీయ మార్కెట్లో సిమెంట్ ధర ఈ నెలలో బస్తాకు రూ.25 నుంచి రూ.-50 వరకు పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. గత 12 నెలల కాలంలో సిమెంటు బస్తా రూ.390కి పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. తయారీదారులు ఇప్పుడు ధరల పెరుగుదల భారాన్ని వినియోగదారులపై మోపడం ప్రారంభించారు. దక్షిణ, మధ్య భారతదేశంలో సిమెంట్ ధర ఇప్పటికే బస్తాకు రూ.15 నుండి 20 వరకు పెరిగినట్లు డీలర్లను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి.
అయితే తూర్పు, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సిమెంట్ బస్తాకు రూ.5 నుంచి 10 వరకు పెరిగింది. మార్చిలో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 115 డాలర్లకు చేరాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు కూడా వివిధ కారణాల వల్ల పెరిగాయి. విద్యుత్తు, ఇంధనం ధరలు పెరగడంతో రోడ్డు మార్గంలో సరుకు రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి సిమెంట్ బస్తాకు 40 నుంచి 50 రూపాయల వరకు పెంచాలని సిమెంట్ కంపెనీలు సూచించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌లో 5 నుంచి 7 శాతం వృద్ధి సాధ్యమవుతుంది. అదే సమయంలో 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సిమెంట్ డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హెచ్ గాంధీ చెప్పారు. కానీ ద్వితీయార్థంలో అకాల వర్షాలు, కూలీలు దొరక్కపోవడం వంటి కారణాలతో తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ పరిమాణం 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. చిన్న పట్టణాల్లో మౌలిక వసతులతో కూడిన అందుబాటు ధరల్లో ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణమని అంటున్నారు. అయితే నిర్మాణ వ్యయం పెరుగుదల కారణంగా, డిమాండ్ పెరుగుదలపై కొంత నియంత్రణ ఉంటుంది.