Sunday, December 22, 2024

కోల్ గ్యాసిఫికేషన్‌కు పెట్టుబడి రాయితీలు రూ. 8500 కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో సుస్థిరమైన ఇంధన భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో కోల్ గ్యాసిఫికేషన్ ను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 8,500 కోట్ల పెట్టుబడి రాయితీలను కేటాయించిందని , ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బొగ్గు , లిగ్నైట్ ఉత్పత్తి సంస్థలకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణహిత ఇంధన సృష్టికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రధానంగా ప్రభుత్వ సంస్థలపైనే ఎక్కువగా ఉందన్నారు. దేశ ఇంధన అవసరాలకు తగిన విధంగా బొగ్గును అందించడంతో పాటు రానున్న కాలంలో పర్యావరణకు హాని కలిగించని ఆధునిక పద్ధతుల్లో ఇంధన సృష్టి జరగాల్సి ఉందన్నారు.

ఈ నేపథ్యంలో బొగ్గు , లిగ్నైట్ ఖనిజాలను భూగర్భంలోనే మండించి తద్వారా మీథేన్ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేయడం ద్వారా కూడా ఇంధన అవసరాలు తీర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విధానానికి మరింత ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను కేటాయించిందని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమ్రిత్ లాల్ మీనా తెలిపారు. బొగ్గు, లిగ్నెట్ సంస్థల వారు కోల్ గ్యాసిఫికేషన్‌కు తమ వద్ద అనుకూలంగా ఉన్న గనులను గుర్తించి వెంటనే దీనిని అమలు జరపాలని, దీనికోసం కేంద్ర బొగ్గు శాఖ అందించే రాయితీలను పొందాలని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కోల్ గాసిఫికేషన్ చేపట్టడానికి అన్ని కంపెనీల వారు ముందుకు రావాలని అటువంటి వారికి కావలసిన స్థలం ఆర్థిక సహకారం రాయితీలు వంటివి కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కాగా ఈ సమావేశంలో కోల్ ఇండియా తో పాటు దేశంలోని పలు బొగ్గు ,లిగ్నైట్ ఉత్పత్తి సంస్థలు విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని తెలిపారు.

మూతపడిన భూగర్భ గనులు ఈ ప్రక్రియను సులువుగా తక్కువ ఖర్చుతో అమలు జరిపే అవకాశం ఉందన్నారు. ముందుగా ప్రభుత్వ కంపెనీలు , ప్రభుత్వ భాగస్వామ్యం గల కంపెనీల వారు దీనిని చేపట్టాలని సూచించారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియ పర్యావరణహితమైనదే కాకుండా ఆయా సంస్థల వ్యాపార విస్తరణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియను అమలు జరపడం కోసం దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని, అన్ని చోట్ల చక్కని స్పందన లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రూపేందర్ బ్రార్, సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండి ఎన్. బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News