Thursday, January 23, 2025

5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’ రద్దు చేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులను ఫెయిల్ చేసేందుకు అవకాశం ఏర్పడినట్టవుతుంది. విద్యాహక్కు చట్టం 2019కు చేసిన సవరణ ప్రకారం కనీసం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయని పేర్కొంది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం , సాధారణ పరీక్షలో విద్యార్థి పై తరగతులకు ప్రమోట్ కావడంలో విఫలమైతే, మళ్లీ పరీక్ష పెడతారు. ఒకవేళ రీ ఎగ్జామ్ లోనూ ఫెయిల్ అయితే , సదరు విద్యార్థులు మళ్లీ ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థినీ బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం పరిధి లోని దాదాపు 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాఠశాల విద్య రాష్ట్ర జాబితా లోని అంశం గనుక ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే 16 రాష్ట్రాలు, ఢిల్లీ సహా రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశాయని సదరు అధికారి పేర్కొన్నారు. హర్యానా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మిగతా రాష్ట్రాలు మాత్రం ఈ విధానాన్నే కొనాగించాలని నిర్ణయించుకున్నట్టు అధికారి తెలిపారు. నూతన విద్యావిధానంలో భాగంగా కేంద్రం డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షలో ఫెయిలైతే తిరిగి అదే తరగతిలో చదివేలా చేయడం)పై గతంలో రాష్ట్రాల నుంచి అభిప్రాయాలను కోరారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే నో డిటెన్షన్ విధానమే అమలవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News