5 ఫారాలు 4 ఫీజులు అంతే
న్యూఢిల్లీ: దేశంలో డ్రోన్ల నిర్వహణకు సంబంధించిన నియమనిబంధనలను కేంద్రం మరింతగా సరళీకృతం చేసింది. దీని మేరకు డ్రోన్లు నడిపించే వారు కేవలం ఐదు ఫారంలు నింపితే చాలు,ఇక 4 రకాల రుసుంలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటివరకూ డ్రోన్ల నిర్వహణకు ముందుకు వచ్చే వారు పాతిక వరకూ ఫారాలు నింపాల్సి ఉండేది. పలు నిబంధనలపై వివరణలు ఇచ్చుకోవల్సి వచ్చేది. ఇక వివిధ స్థాయిలో 72 రకాల ఫీజులు వసూళ్లు జరిగేవి. అయితే ఇప్పుడు సరళీకృత దశలతో ఇకపై కేవలం 4 రకాల ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. డ్రోను రూల్స్ 2021 పేరిట నోటీఫికేషన్‌ను కేంద్రం వెలువరించింది. ఇంతకు ముందటి యుఎఎస్ రూల్స్ స్థానంలో వీటిని తీసుకువచ్చారు. పాత రూల్స్ ఈ ఏడాది మార్చిలోనే అమలులోకి వచ్చాయి. డ్రోన్ల సైజుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఫీజులను సరళీకృతం చేస్తూ కొత్త నిబంధనలలో చేర్చారు.
ఇతరత్రా కూడా డ్రోన్ల నిర్వహణకు ఎక్కువగా అవకాశం కల్పించారు. ఉదాహరణకు రిమోట్ పైలెట్ లైసెన్సును అన్ని కేటగిరీల డ్రోన్లకు ఇంతకు ముందటి రూ 3000 నుంచి కేవలం రూ 100కు కుదించారు. ఈ లైసెన్సు పది సంవత్సరాలు చెల్లుతుంది. అంతేకాకుండా వివిధ స్థాయిల అనుమతుల అవసరం ఉండదు. అదే విధంగా డ్రోన్లకు విభిన్న సంఖ్య, ఇంజన్ నెంబర్లు, తయారీదారు సర్టిఫికేట్లు , గాలిలో ప్రయాణ సామర్థం వంటి వాటిపై పత్రాల విషయంలో కూడా సడలింపులు జరిగాయి. ఇక గ్రీన్ జోన్లలో 400 అడుగుల ఎత్తు వరకూ డ్రోన్ల సంచారానికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. అయితే ఎయిర్‌పోర్టుల పరిధిలోని 8 12 కిలోమీటర్ల లోపున నిబంధనలు వర్తిస్తాయి. సరిహద్దులలో డ్రోన్ల సంచారంతో కలవరం దశలోనే వీటి నిర్వహణకు సంబంధించి వెసులుబాట్లు కల్పించడం ప్రధాన అంశం అయింది.