Thursday, January 2, 2025

ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్: ఒక ఔట్ లుక్

- Advertisement -
- Advertisement -

‘The rules of the world are changing. It is time for the rules of teaching and teachers’ work to change with them’ Andy Hargreaves ‘Each to choose their own paths in life, regardless of education, no one can predict the outcome, then one goal in front of him. Anything that can be based on the values of what’s coming’ Istvan Molnar
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) నివేదిక ప్రకారం గత 2023 నవంబర్ నాటికి మన దేశంలో నిరుద్యోగిత రేటు 36.2% అని తెలుస్తున్నది. నిజంగా ఇది దిగ్భ్రాంతిని కలిగించే అంశం, విచారకరమైన విషయం. నిరుద్యోగులు అంటే చదువుకుని ఏ ఉపాధి లేకుండా కాలం వెళ్లదీస్తున్న యువకులు, మధ్య వయస్కులే కదా. మరి, దేశంలో పని సమూహం (Work Force)లో చేరిఉండాల్సిన ఇంత పెద్దమొత్తం మానవ వనరులు పనికి రాకుండా ఉన్నప్పుడు బాధ, దిగ్భ్రాంతితో పాటు దుఃఖం కూడా కలుగక మానదు. అయితే వీళ్లలో కొందరు ఏదో ఒక శ్రమ చేస్తూ పొట్టపోసుకుండవచ్చుగాక! అది పనికిందకు రాదు. ఎందుకంటే, మెదడుకు తగిన పని, శరీరానికి తగిన పని చేస్తేనే అది పని కింద లెక్క. చేయాల్సిన పనులు కాకుండా ఏదో ఒకటి చేయడం సమాజానికే కాదు, కనిష్ఠంగా వ్యక్తికీ ఏం ప్రయోజనం చేకూర్చదు. పైగా సిఎంఐఇ నివేదిక పేర్కొన్నవాళ్లంతా ఎంతో కొంత చదువుకున్నవాళ్లే, కొందరైతే ఉన్నత విద్యావంతులు కూడా.

అంటే చదువు పని నేర్పాలి, కచ్చితంగా చదువు పనికి రావాలనేది వృత్తి కోణం, అభివృద్ధి కోణం. అందుకే విద్యా దృక్పథం మార్పు గురించి, ఫలితాల ఆధారిత అభ్యసన విధానం (Outcome Based Learning System ) గురించి ప్రపంచ విద్యావేత్తలు గత ఆరేడు దశాబ్దాలుగా చర్చిస్తూ వస్తున్నారు. కోర్సు లేదా ప్రోగ్రాం ముగిశాక విద్యార్థులు ఏం నేర్చుకున్నారు? ఏయే నైపుణ్యాల్లో సుశిక్షితులైనారు? ఏయే పనులు చేయగలుగుతున్నారు? అనేదే ముఖ్యం .దీన్నే ‘అభ్యసన ఫలితం (Learning Outcome)’ అంటారు. ఇదే, ఈ అభ్యసన ఫలితమే నిరుద్యోగితను భారీ మొత్తంలో తగ్గించగలదు. విద్యార్థి పూర్తి చేసిన డిప్లమా లేదా డిగ్రీ ద్వారా అకడమిక్ జ్ఞానార్జనతో పాటు, విద్యార్థుల్లో తమ కెరీర్‌లో ఎదగడానికి సహాయపడే నైపుణ్య సముపార్జనతో పాటు పని అనుభవం పని సంస్కృతి పెంపొందితేనే అది చదువు కింద లెక్క.మునపటి కంటే విద్యకు ఇప్పుడు ప్రాప్యత (Access) పెరిగిన దరిమిలా విద్యార్థులు బాగా చదవగలగడం, రాయగలగడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, కమ్యూనికేట్ చేయగలగడం వంటి నైపుణ్యాలే వర్తమాన విద్యా నాణ్యత. నైపుణ్యాలను అలవర్చడమే కాకుండా, జ్ఞానాన్ని మథించి ఆలోచనా పరిధులను విస్తృతం చేయడం, జీవితానికి మెరుగైన దృక్పథాన్ని జోడించగల శక్తియుక్తులు ప్రసాదించ గలిగినదే ఉత్తమ విద్య అని ఆధునికుల భావన.

అందుకే ఇప్పుడు ప్రజలు ప్రాకృతిక హక్కులు మొదలుకొని సామాజిక అస్తవ్యస్తతల దాకా అనేక సమస్యల గురించి చాలా అవగాహనతో స్పందిస్తున్నారు. సమాజంలో సంభవిస్తున్న అనేక పరిణామాలను అంగీకరిస్తూ మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉంటున్నారు. ఇదంతా కొత్త తరహా అభ్యసన ఫలితం. వ్యక్తి తన వైయక్తిక జీవితం నుండి సామాజిక జీవితం వరకు ఆరోగ్యకరంగా జీవించడానికి అభ్యసన ఫలితం చోదకశక్తిగా పని చేస్తుంది. మిగతా వాటన్నిటి కంటే ముఖ్యంగా విద్యలో సొంత ఎదుగుదల (Self growth)తో పాటు కమ్యూనిటీ అభివృద్ధి (Community development) కూడా నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన ఒక విలువైన అంశం. ప్రపంచీకరణ అనంతర పరిస్థితుల నేపథ్యంలో విద్య ప్రాముఖ్యత సృజనాత్మకత, ఆవిష్కరణల వైపులకు ప్రోత్సహించడం. ఈ విషయంలో కొంత మెరుగవడం శుభపరిణామమే. అయినప్పటికినీ సంప్రదాయ మూస విద్యా విధానంలోనే మన చదువులు ఇంకా మగ్గుతున్నాయి. మనకు సైకాలజీలో మేధాకృతి (Structure Of Intellect) అనే మాట ఉంది. ఆలోచనా సామర్థ్యం ఎట్లా పెంపొందుతుందో మేధాకృతి (ఎస్‌ఒఐ)లో చర్చకొస్తుంది. జ్ఞాపకశక్తి (Memory), అభిజ్ఞ (Cognition), శాస్త్రీయ సమాలోచన (Critical thinking),

సృజనాత్మకత (Creativity), సమస్యా పరిష్కారం (Problem solving) ఈ ఐదు మేధోస్తంభాల ( Pillors of intelligence) కట్టుబడిలో పరిపూర్ణ మేధాకృతి ఆవిర్భావం జరుగుతుంది. మేధాకృతి సిద్ధించకుండా బాక్స్ వెలుపల ఆలోచించడం వీలుపడదు. బాక్స్ వెలుపల ఆలోచించడం రాని పక్షంలో విద్యా కర్తవ్యం, స్ఫూర్తి పూర్తిగా నెరవేరవు. ఈ లక్ష్యం కోసమే ఫలితాల ఆధారిత విద్య (Outcome Based Education) ఫ్రేమ్‌వర్క్ బ్లూమ్ వర్గీకరణ ఫ్రేమ్‌వర్క్‌తో అనుసంధానించారు. విద్యలో అనేక పార్శ్వాలను కవర్ చేయడం, అభ్యసన అంతరాలను పూరించడం ఫలితాల ఆధారిత విద్య మూలంగానే నెరవేరతాయి. అయితే, అన్ని సార్లు అన్నింటికీ అభ్యసన ఫలితం పరిష్కారంగానే ఉండదు, సమస్యగా కూడా ఫలితం ఉంటుంది.నేర్చుకునే సామర్థ్యం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటున్నప్పుడు మొత్తం క్లాసంతా ఒక ఉదుటన నేర్చేసుకున్నారని ఎట్లా నిర్ధారిస్తారు? ఇది చాలా కాలంగా ఉపాధ్యాయులపై విమర్శకులు సంధిస్తున్న ప్రశ్న. విద్యావేత్తలు సైతం అభ్యసన ఫలితం (Learning Outcome) విద్యార్థుల క్రమశిక్షణ, సహజ సామర్థ్యాల మూలంగానే సిద్ధించగలదంటున్న నేపథ్యంలో అమెరికా విద్యావేత్త, కవి Joseph T. Renaldi కవిత ‘Graduation Day’ను మీతో ప్రస్తావిస్తున్నాను.

విద్యా ఫలితం విద్యార్థితో పాటు తల్లిదండ్రులకు కూడా ఎంత ముఖ్యమో ఎరుక చెప్పే ఈ కవితలో ‘Graduation day is the climax of a dream, A parental dream that began when a child is born, And their hope come true it would seem- A triumph held after periods of forlorn, A feeling of pride and euphoria years away, For a daughter or son -Graduation day It is a peak of success for the graduate, Not only for the graduate but parents too’ అంటూ సాంప్రదాయ విద్యపై పరోక్షంగా ఘాటైన విమర్శ చేస్తాడు రెనాల్డీ. సాంప్రదాయ విద్యా విధానంలో ఉపాధ్యాయులు నేర్పడానికి, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో సంబంధిత సిలబస్ నేర్చుకోవడానికి చాలా సమయాన్ని వెచ్చించేవారు. అప్పట్లో కోర్సు, పాఠ్యాంశాల ప్రధాన లక్ష్యం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే. దీని మూలంగానే విద్యార్థులకు కోర్సు ముగిసే సమయానికి తగినంత నైపుణ్యం, పరిజ్ఞానం ఉండకుండాపోయాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కంపెనీలకు కావలసిన పని సమూహాల (Work force) అవసరాలకు సరిపోయేంత నైపుణ్యాలు చాలా మంది విద్యార్థులకు లేనందున దేశంలో నిరుద్యోగ సమస్య హెచ్చుతూ వచ్చింది.

ఏ నైపుణ్యాలను అలవరచని సాంప్రదాయ విద్య మూలాన పరిశ్రమల అవసరాలకు కరిక్యులంకు మధ్య భారీ అంతరాలు తిష్ఠవేశాయి. అందుకే రెనాల్డీ ‘గ్రాడ్యుయేషన్ డే’ కవిత అన్ని కాలాలకు ప్రాసంగికత కలిగి వున్నది. వేలాదిగా వెలసిన విద్యా సంస్థలు సమాజం అవసరాలను తీర్చలేనివి మూతబడిన స్థితినీ మనం చూస్తున్నాం. గతంలో విద్యావేత్తలు అభ్యాస ఫలితాలను విద్యార్థుల ఎక్కువ (high) లేదా తక్కువ (low) క్రమశిక్షణ, సహజ సామర్థ్యాల ఉత్పత్తి అని నమ్మారు. కానీ ఆధునిక విద్యావేత్తలు విద్యార్థి స్థాయీ భేదాన్ని గమనించి బోధించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మాత్రమే అభ్యసన ఫలితాలను మార్చగలరని నమ్ముతున్నారు. ఫలితాలను మార్చడానికి అత్యంత విజయవంతమైన మార్గాలలో ఒకటి బోధనా భేదం అమలు చేయడం. ప్రసిద్ధ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ ఔట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్‌గా ఖ్యాతిగడించిన విలియం జి. స్పాడీ ఫలితాధారిత విద్యను సంభావితీకరిస్తూ విద్యా వ్యవస్థలో ‘పునః స్థితి లేదా పునరభి విన్యాసం ఘ(Reorientation)గా అభివర్ణించాడు. ఫలితా ధారిత విద్య, దాని ప్రధానాంగాలైన 1. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, 2. బోధన, అభ్యాస పద్ధతులు, 3. అంచనా, నిరంతర నాణ్యత 4. మెరుగుదల (CQI), పర్యవేక్షణ’ల్లో విద్యార్థి కేంద్రంగా కృత్యాల గుర్తింపు, అభ్యసనం ద్వారానే విజయవంతం అవుతుందంటాడు.

ఈయన ఇతర రచనలతో పాటు ఇటీవల వెలువరించిన ‘Outcome -Based Education’s Empowering Essence: Elevating Learning for an Awakening World Outcome’ అనే గ్రంథం తరగతి నిర్వహణలో ఉపాధ్యాయులను విప్లవాత్మక మార్పుల దిశగా నడిపించగలదు. సాంప్రదాయ విద్యకు ఫలితాల ఆధారిత విద్యకు మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర వ్యత్యాసాల నడుమ విధాన నిర్ణాయకులు దేశ భవిష్యత్తు దృష్ట్యా ఫలితాల ఆధారిత విద్యను మరింత పటిష్ఠంగా అమలు చేయవలసి వుంది. నేటి విద్యార్థులు రేపటి పెద్దలు. ఇప్పటి సంగతి ఎట్లా ఉన్నా భవిష్యత్తులో వీళ్లకు జీవన నైపుణ్యాలు, విద్యా నైపుణ్యాలు కలగలసిన సామర్థ్యాలుంటేనే సమాజంలో రాణించగలుగుతారు. సంప్రదాయ విద్య వల్ల జీవన నైపుణ్యాలు అలవడినా, విద్యా నైపుణ్యాలు పని నైపుణ్యాలు లేకపోతే జీవితం అసంపూర్ణం, అర్థరహితం. ఔట్‌కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పని నైపుణ్యాలను విద్యా నైపుణ్యాలను తలపెట్టింది. క్రియాశీలక ఫలితాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తూ విద్యపై సాంప్రదాయక దృష్టిని తిరస్కరించింది. మార్కులు సాధిస్తూ టాపర్స్‌గా నిలపడం మీదనే కాకుండా పని నైపుణ్యాలు, ప్రమాణాల అభివృద్ధిపై దృష్టిపెడుతూ తరగతి సగటు గ్రేడింగ్ కంటే విద్యార్థుల పని సామర్థ్యాలు అంచనాలకే ప్రాధాన్యతనిస్తుంది.

అభ్యసనంలో వాస్తవాలు గణాంకాలను గుర్తుంచుకునే జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా ఇంతకు ముందు అనుకున్నట్టు సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనల అభివృద్ధిని ఫలితాల ఆధారిత విద్య వెన్నంటి ఉంటుంది. అందుకే దేశ వ్యాప్తంగా ఫలితాల ఆధారిత అభ్యసన విధానాన్ని అవలంబించేలా ప్రభుత్వం విద్యా సంస్థలను ఇతోధికంగా ప్రోత్సహించడం ఇవాళ్టి తక్షణావసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News