బడ్జెట్ సమావేశాల్లోనే ప్రకటన..?
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌నిధి కింద ఇచ్చే నగదు మద్దతును పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6000 మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2000 చొప్పున వారి ఖాతాల్లో కేంద్రం వేస్తోంది. ఈ మొత్తాన్ని పెంచనున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఏడు విడతల్లో రైతులకు ఈ పథకం కింద నగదును కేంద్రం అందించింది. దేశంలోని 11 కోట్లమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్టు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కరోనా సంక్షోభం అనంతరం జరిగే బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు చేపడ్తారన్నదానిపై ఆసక్తి నెలకొన్నది.