Monday, December 23, 2024

‘సెస్’ బుస్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాలను అస్థిరపరుస్తోంది. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులను క్రమంగా తగ్గిస్తోంది. సెస్సులు, సర్‌చార్జీల రూపంలో దొడ్డిదారిన కేంద్ర ఖజానాకు తరలించుకుపోతోంది. దీంతో కేంద్ర పన్నుల రాష్ట్రాలకు రావాల్సిన వాటా క్రమంగా తగ్గుతూ పోతోంది. సెస్, సర్‌చార్జీలను పెంచుతు రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని కేంద్రం పెద్దఎత్తున గండికొడుతోంది. ఈ సెస్‌ల వసూళ్లకు ఎలాంటి రూల్స్ అడ్డు రావు. సరిగ్గా ఇదే ప్లాన్ తో రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం దారి మళ్లిస్తోంది. రాష్ట్రాల వాటాను కేంద్రం దర్జాగా దోచుకుంటోంది. ఇలా దోచుకోవడం సరికాదని రాష్ట్రాలు నెత్తి, నోరు కొట్టుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా….కేంద్రం మాత్రం తమ దారి తమదే అన్న చందంగా ఒంటెద్దు పోకడలతో నియతృత్వంగా వ్యవహరిస్తోంది. పేదల బతుకులు మారుస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం…. సామాన్యులపై అదనపు పన్నులు మోపుతూ గత ఆరేండ్లలోనే ఏకంగా 133 శాతానికి పెంచేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే అంగీకరించింది.

అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి చెందుతేనే….దేశం ముందుకు పోతుందన్న విషయాన్ని కూడా మోడీ ప్రభుత్వం విస్మరిస్తోంది. పైగా తమ దయాదాక్షిణ్యాలపై రాష్ట్రాలు మనుగడ సాధించాలన్న మందబుద్ధితో ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదతర రంగాల్లో సెస్సులను ఇష్టానుసారంగా వసూలు చేస్తోంది. అయితే పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే రాబడిలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది కానీ….. సెస్సుల్లో మాత్రం ఎలాంటి వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే వివిధ రకాల పన్నులను మోడీ సర్కార్ క్రమంగా సెస్సుల రూపంలోకి మారుస్తోంది. దీని కారణంగా రాష్ట్రాలకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం ప్రతి సంవత్సరం గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులో రాష్ట్రాలకు 41శాతం నిధులు కేటాయించాలని 15 వ ఆర్దిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందుకు కేంద్రం తిలోదకాలు ఇస్తూ పన్నులను సెస్‌లు, సర్‌చార్జీలతో వసూలు చేస్తుండడంతో రాష్ట్రాలకు వచ్చే రాబడి క్రమంగా క్షీణిస్తోంది.

ఈ నేపథ్యంలో 2018…20-19లో రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం 36.6 శాతం కాగా, 2021…20-22 నాటికి 33.2 శాతం,. 2022..2023లో1.2 శాతం, 2023..20-24 అంచనాల్లో 30.4 శాతమే రానుంది. ఇదిలా కేంద్రం సెస్‌ల రూపంలో వసూలు ఆదాయం మాత్రం భారీగా పెరిగింది. ఇందులో 2017..20-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2,18,553 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022..20-23)లో జనవరి నెల వరకు రూ.5,10,549 కోట్లకు పెరిగిందని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అడ్డగోలుగా గండికొడుతున్న మోడీ సర్కార్

రాష్ట్రాల ఆదాయానికి మోడీ సర్కార్ అడ్డగోలుగా గండి కొడుతోంది. ఆ నిధులను సెస్సులు, సర్‌చార్జీల రూపంలో తన ఖజానాకు మళ్లించుకుంటున్నది. కొద్ది రోజుల క్రితం లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 చొప్పున పన్ను తగ్గించిన కేంద్రం.. ఆ మేరకు సెస్సులు మాత్రం గణనీయంగా పెంచింది. 15వ ఆర్ధిక సంఘం నిర్ణయించిన ప్రకారం 41 శాతం వాటాగా రాష్ట్రాలకు లీటర్ పెట్రోల్‌పై రూ.1.03, డీజిల్‌పై రూ.1.64 చొప్పున ఆదాయం తగ్గింది. ఆ సొమ్మంతా కేంద్రమే తరలించుకుపోయింది. 2017-…2020 మధ్య కాలంలో కేంద్రం పెట్రోల్‌పై సెస్, సర్‌చార్జీలను 150శాతం, డీజిల్‌పై 350శాతం పెంచింది. 2017..20-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022..20-23లో ఈ బాదుడు ఏకంగా 133 శాతానికి పెరిగింది.
నిజానికి కేంద్రానికి వచ్చే స్థూలపన్నుల ఆదాయంలో డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది.

అయితే డివిజబుల్ పూల్లోకి రాని సెస్సులు, సర్‌చార్జీల పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. ఈ సెస్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3.35 లక్షల కోట్లు ఆర్జించినా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది 5.8 శాతమే. అంటే రూ.19,475 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం మరో రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్‌పై 40 శాతం, డీజిల్‌పై 59 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 85 శాతానికిపైగా ఎక్సైజ్ డ్యూటీని సెస్ రూపంలో వసూలు చేస్తోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 ఉంటే అందులో స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ కింద 11 రూపాయలు, రోడ్లు, మౌలికవసతుల సెస్ కింద 18 రూపాయలు, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన సెస్ కింద 2 రూపాయల 50 పైసలు మొత్తంగా 31.5 శాతం ఆదాయం కేంద్ర ప్రభుత్వానికే లభిస్తోంది. బేసిక్ ఎక్స్‌జై డ్యూటీ కింద వసూలు చేసే 1 రూపాయి 40 పైసలు మాత్రమే రాష్ట్రాలకు పంపిణీ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలను తీరని అన్యాయం
వాస్తవానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా కేంద్రానికి వివిధ రాష్ట్రాల నుంచి రూ.30,48,044 కోట్ల ఆదాయం లభిస్తుండగా, అందులో రాష్ట్రాలకు తిరిగి ఇచ్చింది రూ.8,82,903.79 కోట్లు అని తెలుస్తోంది. అంటే మొత్తం రాబడిలో దాదాపు రూ.22 లక్షల కోట్లను కేంద్రం తన వద్దే ఉంచుకొందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పన్నుల వాటాల పంపిణీలో కేంద్రం ప్రభుత్వం వెల్లడిస్తున్న విధానాలతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది.15వ ఆర్ధిక సంఘం ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక గ్రాంటుతో కలిపి ఎపికి రూ.41,338.02కోట్లు దక్కితే, మన రాష్ట్రానికి కేవలం రూ.21,470.84కోట్లు దక్కాయి. ఈ నిబంధనలతో రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు చాలా కాలంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయి.

ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు తిరిగి పంచి పెట్టే క్రమంలో పెద్ద రాష్ట్రాలకు అత్యధిక వాటా లభిస్తోందని వాపోతున్నాయి. పన్నుల ఆదాయంలో ఉత్తర్ ప్రదేశ్‌కు రూ.1,83,237కోట్లు, బీహార్‌కు రూ.1,02,737.26కోట్లు, మధ్య ప్రదేశ్‌కు రూ.80,183,67 కోట్లు, బెంగాల్‌కు రూ.76,843.55కోట్లు, మహారాష్ట్రకు 64,524.88కోట్లు, రాజస్థాన్‌కు రూ.61,552.47 కోట్లు దక్కుతున్నాయి. దేశంలోని 28 రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తున్న మొత్తం ఆదాయంలో 55.71శాతం వాటా కేవలం ఆరు రాష్ట్రాలే దక్కించుకుంటున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు వచ్చే మొత్తం ఆదాయాన్ని కలిపినా రూ.1,61,388.81కోట్లకు మించడం లేదు. ఐదు రాష్ట్రాలకు పన్నుల ద్వారా వచ్చేఆదాయం కంటే యూపీ ఒక్క రాష్ట్రానికి వచ్చే ఆదాయం 13.53శాతం అధికంగా ఉంటోందని తెలుస్తోంది.

చిన్న రాష్ట్రాలకు శాపంగా మారిన జనాభా నిబంధనలు
జనాభా ఎక్కువ ఉంటే.. ఎక్కువ ఆదాయం వచ్చేలా ఆర్ధిక సంఘం సిఫార్సులు ఉండటం చిన్న రాష్ట్రాలకు శాపంగా మారింది.
వెనుకబడిన రాష్ట్రాలకు గ్రాంట్లు రూపంలో డబ్బులు ఇస్తున్నా తెలంగాణకు అది దక్కడం లేదు. విభజన వల్ల నష్టపోయిన ఎపికి మాత్రమే స్పెషల్ రెవెన్యూ గ్రాంట్ ఇస్తున్నారు. ఆ గ్రాంట్ కూడా మన రాష్ట్రానికి రావడం లేదు. ఇలా అన్ని విధాలుగా రాష్ట్రం నష్టపోవాల్సి వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News