Monday, December 23, 2024

ఇవిగో అనుమతులు

- Advertisement -
- Advertisement -

అబద్ధాలు చెప్పి
అధికారంలోకి రాలేరు

కాళేశ్వరానికి అన్ని అనుమతులిచ్చి
ఇప్పడు తప్పడు ఆరోపణలా?

కాళేశ్వరంపై కేంద్ర మంత్రులది తలోమాట
ఢిల్లీలో ఒకలా.. గల్లీలో మరోలా పార్లమెంట్‌లో
మెచ్చుకోలు.. ప్రజాక్షేత్రంలో తప్పుడు మాటలు
పూటకోలా మాట్లాడి పబ్బం గడుపుకోవాలని
చూస్తున్నారు ప్రజల మధ్యలో అబద్ధాలు వల్లె
వేస్తున్నారు కేంద్ర ఇచ్చిన అనుమతులను ప్రజల
మధ్యలో పెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

మన తెలంగాణ/మేడ్చల్/పటాన్‌చెరు : అబద్ధాలు చెప్పి ఎవరూ అధికారంలోకి రాలేరు.. కేంద్రంలోని మంత్రులు ఢిల్లీలో ఒకలా.. ఇక్కడకువచ్చి మరోలా అబద్ధాలు చెబుతున్నారు. అనుమతి ఇచ్చేది వాళ్లే.. ఇక్కడకు వచ్చి అనుమ తి లేదంటున్నది వాళ్లే. వాళ్లది నోరా.. మోరీనా.. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో ఓ మాట.. పార్లమెంట్‌లో ఓ మాట.. ప్రజాక్షేత్రంలో మరోమాట.. ఇలా కేంద్ర మంత్రులు పూటకోలా మా ట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఉమ్మడి మె దక్ జిల్లా ములుగు, పటాన్‌చెరు, రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఏదోవిధంగా రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి నేత లు అబద్ధాలు వల్లె వేస్తున్నారని, వంద అబద్దాలు ఆడి పెళ్లి చే యాలన్నారు కానీ, బిజెపి వాళ్ల తీరు వంద అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి రావాలన్నట్లుగా ఉందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు పూటకోలా మాట్లాడుతున్నారని, పార్లమెంట్‌లో ఒకలా.. ప్రజాక్షేత్రంలో మరోలా మా ట్లాడున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చింది.. 18లక్షల కొత్త ఆయకట్టు, మరో పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులే చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. అయితే.. బీబీనగర్ వచ్చిన కేంద్రమంత్రి కాళేశ్వరానికి అనుమతులు లేవంటాడు.. ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ లేదంటున్నాడు.. అవినీతి జరిగిందంటున్నాడని ధ్వజమెత్తారు. ఐదు నెలల కిందట పార్లమెంట్‌లో ఏం చెప్పారు? ఇప్పుడు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని అనుమతులు ఇచ్చింది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్న కాగితాలు తెచ్చానంటూ వాటిని ప్రజలకు హరీశ్‌రావు చూపి కేంద్ర మంత్రుల అబద్ధాల మాటలను ప్రజల ముందు సాక్ష్యాలతోసహా చూపించారు. 2017 డిసెంబర్ 22న కేంద్రం ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్, అదే ఏడాది నవంబర్ 24న అటవీ శాఖ అనుమతి వచ్చిందని మంత్రి తెలిపారు. అనుమతి ఇచ్చేది వాళ్లే.. ఇక్కడకు వచ్చి అనుమతి లేదంటుంది వాళ్లేనని.. ఇవేమి అబద్ధాలో ఏంటో అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్‌లైన్ అని, తెలంగాణకు గొప్ప ప్రాజెక్టు అని స్పష్టం చేశారు.

అధికారం కోసమే అబద్ధాలు అడుతున్నారు

మూడు నెలల కిందట శంషాబాద్ వచ్చిన కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గ్రోత్ ఇంజిన్ అన్నాడని, దీంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని అన్న మాటలను హరీశ్‌రావు గుర్తు చేశారు. మోదీ ఉచితాలు వద్దు అంటున్నాడని, రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్, ఉచితంగా 5లక్షల బీమా వద్దంటున్నడని.. పేద మహిళలకు ఆసరా పెన్షన్ 2016 వద్దంటున్నరా? అని ప్రశ్నించారు. పేదలకు ఉచిత పథకాలు వద్దంటూ బడా కంపెనీలకు 12లక్షల కోట్ల రుణాలు కేంద్రం రద్దు చేసిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఎవరు పేదల కోసం పని చేస్తున్నారు? ఎవరు బడా బడా పారిశ్రామికవేత్తల కోసం పనిచేస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు.

ఎయిమ్స్ పరువు తీసేస్తున్నారు..

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లి అడ్డగోలుగా మాట్లాడరని హరీశ్‌రావు విమర్శించారు. ఎయిమ్స్ ప్రతిష్టాత్మక సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ పెడతమంటే 201 ఎకరాల భూమి ఇస్తే.. కేవలం 200 పడకల ఆసుపత్రి ఇచ్చిందన్నారు. నాలుగేళ్లయినా ఎయిమ్స్‌లో ఒక్క కాన్పు చేయలేదన్నారు. ఆపరేషన్ థియేటర్, బ్లడ్‌బ్యాంక్ లేదన్నారు. ఇక్కడ చదువుకునేందుకు మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు.. వారు ఏం చదువుకోవాలని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం ఉద్ధరిస్తోందని చెప్పుకుంటున్నారని, విద్యార్థులు ఎందుకు చేరామని నెత్తి పట్టుకుంటున్నారన్నారనారు. తాము ఎయిమ్స్‌లో చేయమని అంటున్నారని.. ఉస్మానియా, గాంధీలో చేర్చుకోవాలని కోరుతున్నారని.. కిషన్‌రెడ్డి మీరు ఎయిమ్స్‌కు వెళ్లి చూస్తే అక్కడ వైద్య విద్యార్థుల పరిస్థితి, ఆస్పత్రి తీరు అర్థమవుతుందని హరీశ్ రావు సలహా ఇచ్చారు.

ఎయిమ్స్ కోసం గొప్పగా చెప్పారు.. తీరా దాని పరువు తీశారని మంత్రి మండిపడ్డారు. భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 1083 డెలివరీలు అయ్యాయని, రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో 245 డెలివరీలు జరిగాయన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ఉన్న అర్బన్ పీహెచ్‌సీలో కూడా 13 అయ్యయన్నారు. ఎయిమ్స్‌లో ఒక్క డెలివరీ కాలేదని.. ఇది మీ బిజెపి కేంద్ర ప్రభుత్వ పనితీరు అంటూ హరీశ్ దెప్పిపొడిచారు. పనిచేసే వైద్యులను తగ్గించేలా మాట్లాడడం సరికాదని మండిపడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం

గాంధీలో 250, నిమ్స్‌లో 250 పడకల మాతా శిశు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. వేలకోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో, శామిర్‌పేట చెరువుకు రెండు మూడు నెలల్లో నీళ్లు వస్తాయన్నారు. రావల్‌కోల్ కెనాల్ ద్వారా మేడ్చల్‌కు కాళేశ్వరం నీళ్లు తీసుకువస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు వస్తుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని విమర్శించారు.

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్‌రూంలున్నాయా.. ?

బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిన దాఖలాలు లేవు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.60వేలు ఇస్తే ఆ డబ్బులు బెస్‌మెంట్‌కు కూడా సరిపోయేవి కావని హరీశ్ విమర్శించారు. కెసిఆర్ నేతృత్వంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్త ఇళ్లల్లో గృహప్రవేశాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, సాగునీటి, తాగునీరు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. అయా కార్యక్రమాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్‌చెరు ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News