న్యూఢిల్లీ : స్థానిక ప్రజారోగ్య పరిస్థితిని , కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని అంచనా వేయడానికి ఐసిఎంఆర్‌తో సంప్రదించి జిల్లా స్థాయిలో సీరో సర్వేలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈమేరకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. దేశం లోని 70 జిల్లాలో ఐసిఎంఆర్ ఇటీవల నిర్వహించిన సీరో సర్వే వివరాలను తెలియచేశారు. మధ్యప్రదేశ్‌లో 79 శాతం, మహారాష్ట్రలో 58 శాతం, కేరళలో 44.4 శాతం , రాజస్థాన్‌లో 76.2 శాతం, బీహార్‌లో 75.9 శాతం వరకు సీరోప్రెవలెన్స్‌ను గ్రహించ గలిగారు. అలాగే గుజరాత్‌లో 75.3 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 71 శాతం, కర్ణాటకలో 69.8 శాతం, తమిళనాడులో 69.2 శాతం, ఒడిశాలో 68.1 శాతం, పంజాబ్‌లో 66.5 శాతం, తెలంగాణలో 63.1 శాతం, అస్సోంలో 50.3 శాతం, పశ్చిమబెంగాల్‌లో 60.9 శాతం, కనుగొన్నారు. ఐసిఎంఆర్ ప్రామాణికాలతో నిర్వహించే ఈ సర్వేల ద్వారా వచ్చే ఫలితాలు పారదర్శకంగా, సాక్షాధారంగా ఉంటే ప్రజా ఆరోగ్య భద్రతకు తోడ్పడతాయని కేంద్రం సూచించింది.