Wednesday, January 22, 2025

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతధోరణి

- Advertisement -
- Advertisement -

Center is biased towards southern states:Gutta sukender

 

మన తెలంగాణ/నల్లగొండ: దేశం లోని దక్షిణాది రాష్ట్రాల పై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్సీ, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో సమానత్వం పాటించాల్సిన కేంద్రం రాష్ట్రానికో విధంగా అనుసరిస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విభజన హామీలను కేంద్రం గాలికి వదిలేసిందని తెలిపారు. నల్లగొండ లో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి గా ఉన్న కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహం లా మారిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కిషన్ రెడ్డికి ఏమాత్రం పట్టడంలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అక్కసు వెళ్లగక్కుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రాల మధ్య కావాలని వ్యత్యాసం చూపెడుతోన్న కేంద్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం గురించి వాస్తవాలు మాట్లాడితే భారతీయ జనతాపార్టీ అడ్డగోలు పెడర్థాలు వెతికి మరీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా గతంలో అనేక పర్యాయాలు రాజ్యాంగాన్ని పు:నసమీక్షించారని గుర్తు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ స్పూర్తితో నే రాజ్యాంగంలో పు:న సమీక్ష లు జరుగుతాయని, సిఎ౦ కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల్లో తప్పు ఏముందో బీజేపీ నేతలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని, బీజేపీ నేతలకు దమ్ము ధైర్యం ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టు లకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ని మంజూరు చేయించుకొని ప్రజలకు మొహం చూపించాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు తెగనమ్మడమే బీజేపీ పనిగా పెట్టుకుందని, బీజేపీ పాలనలో అంబానీలు, ఆదానిల బాగోగులు తప్ప పేద ప్రజలు గురించి బిజెపి లో ఎవ్వరు మాట్లాడరని, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతు౦దని వివరించారు. తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకనే బీజేపీ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం తెలంగాణ బీజేపీ ఎంపీ లకు అంత మాత్రం ఉందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల చవకబారు ఆరోపణలను బీజేపీ నాయకులు వాస్తవాలను గుర్తెరిగి ఇప్పటికైనా ఆపాలని సూచించారు. చేతకాని దద్దమ్మలా బీజేపీ వాళ్ళు అవాకులు చవాకులు పేళుతున్నారని ధ్వజమెత్తారు. చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చమంటే చేతకాని బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడిన వాస్తవ వ్యాఖ్యలను వివాదం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా మారకపోతే బీజేపీ వాళ్లకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News