ఆరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం రూ.లక్షా40వేల 329 కోట్లు
నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఇంకా రూ.24వేల కోట్లు రావాలి
విభజన చట్ట ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద ఒక్క సంవ్సతరానికి రూ.450 కోట్లు ఇవ్వాలి
మన తెలంగాణ/ హైదరాబాద్ : సమైక్య పాలకుల చేతిలో దశాబ్దాల తరబడి దగాపడి దోపిడీకి గురైన తెలంగాణ ప్రాంతం నేడు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత కూడా దగా పడుతూనే దోపిడీకి గురవుతోంది. అయితే ప్రస్తుతం దగా చేస్తున్నదీ, దోపిడీకి పాల్పడుతున్నది మాత్రం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అధికారికంగానే తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటాలో రావాల్సిన నిధుల్లోగానీ, నీతి ఆయోగ్ సిఫారసుల రూపంలో రావాల్సిన నిధుల్లోగానీ, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్ధిక సహాయం నిధులను జారీ చేయడంలోగానీ, ప్రగతి ఆధారిత ఫండ్స్‌ను జారీ చేయడంలో గానీ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం బాహాటంగానే అన్యాయం చేస్తూనే ఉంది. పన్నుల రూపంలో లక్షలాది కోట్ల రూపాయలను వసూలు చేసుకొంటూ కేవలం 41 శాతం నిధులను మాత్రమే ఇస్తూ మిగతా అనేక రూపాల్లో రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రమే స్వాహా చేస్తోంది. అసలే కరోనా సృష్టించిన కల్లోలం నుంచి ఆర్ధికంగా తీవ్రస్థాయిలో నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకోవాల్సన కేంద్ర ప్రభుత్వం ఆదుకోకపోగా కేంద్రం రూపొందించిన నియమ నిబంధనల మేరకే రావాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదంటే ఇది దోపిడీ కాదా& ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోవడం కూడా దోపిడీ కిందికే వస్తుందని ఆర్ధికశాఖ వర్గాలు మండిపడుతున్నాయి.
2014-15వ ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-20వ ఆర్ధిక సంవత్సరం వరకూ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా రెండు లక్షల 72వేల 926 కోట్ల రూపాయల నిధులను వసూలు చేసుకొంది. ఈ ఆరేళ్ళల్లో పన్నుల వాటాగా కేవలం 86వేల 391 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్ధిక సంఘం నుంచి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల నుంచి కలిపి కేవలం 53వేల 937 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. అంటే గడచిన ఆరేళ్ళల్లో కేవలం ఒక లక్షా 40 వేల 329 కోట్ల రూపాయల నిధులను మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొన్న నీతీఆయోగ్ సిఫారసుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి మరో 24 వేల కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉండగా ఒక్క పైసాను కూడా విడుదల చేయలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పాత తొమ్మిది జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల (బీ.ఆర్.జీ.ఎఫ్) కింద ఏడాదికి ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల లెక్కన తొమ్మిది జిల్లాలకు కలిపి ఒక సంవత్సరానికి 450 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉంది.
అయితే ఈ నిధులను గడచిన మూడేళ్ళుగా ఇవ్వకుండా కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఈ లెక్కన బీ.ఆర్.జీ.ఎఫ్ కోటా కింది 1350 కోట్ల రూపాయలను తెలంగాణకు ఇవ్వకుండా కేంద్రం ఎగ్గొట్టింది. అంతేగాక రాష్ట్రాల పనితీరు బాగుండి ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను దృష్టిలో ఉంచుకొని ప్రగతి ఆధారంగా నిధులు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆ సంప్రదాయాన్ని కూడా కేంద్రం మంటగలిపింది. ప్రగతి ఆధారిత ఫండ్స్ రూపంలో కనీసం గడచిన ఆరేళ్ళల్లో 30 వేల కోట్ల రూపాయలైనా రావాల్సి ఉండిందని, కానీ కేంద్రం ఎందుకో తెలంగాణ రాష్ట్రం పట్ల అంతులేని నిర్లక్షం, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అధికారవర్గాలు తీవ్ర అసంతృప్తిని, అంతులేని ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టుకోవడానికి ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రయత్నాలన్నింటినీ కేంద్రం పెడచెవిన పెట్టింది. దేశం యావత్తూ కీర్తించిన మిషన్ భగీరథ పథకాన్ని అభినందించి ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ మాదిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను కోరిన నీతి ఆయోగ్ తెలంగాణ రాష్ట్రానికి 19 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సహాయాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది.
అంతేగాక మిషన్ కాకతీయ పథకం అమలవుతున్న తీరుతెన్నులను పరిశీలించిన నీతి ఆయోగ్ ఈ పథకానికి కూడా మరో అయిదు వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని కూడా నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఇలా ఈ రెండు పథకాలకు కలిపి ౨౪ వేల కోట్ల రూపాయలను తెలంగాణకు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ఆర్ధికశాఖకు సిఫారసు చేసింది. కేంద్ర ఆర్ధికశాఖ నుంచి చివరకు ప్రధానమంత్రి వరకూ నీతి ఆయోగ్ సిఫారసులను ఎంతో గౌరవంగా పాటిస్తామని చెప్పుకొంటారని, కానీ తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్ధిక సహాయం చేయండని సిఫారసులు చేస్తే మాత్రం ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌గానీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ గానీ ఏనాడూ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవని అధికారవర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. అందుకే ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడొకరు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలపైన చర్చలు జరుపుదామని, అందుకు తగిన సమయం ఇవ్వాలని ఒక కేబినేట్ మంత్రిని కోరగా అందుకు ఆ మంత్రి నిర్దంధంగా తిరస్కరించినట్లు తెలిసింది.
నిధులు ఇవ్వని, పసలేని, పనికిమాలిన చర్చలు ఎందుకులే&అని ఆ సభ్యుడి అభ్యర్ధనను తోసిపుచ్చినట్లు తెలిసింది. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు 1350 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఇటీవల రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి హరీష్‌రావు ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి కోరారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలన్నింటీనీ కేంద్రం బుట్టదాఖలు చేసినట్లుగా ఉందేగానీ ఒక్క రూపాయి నిధులను కూడా విడుదల చేయలేదని అధికారవర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. అంతేగాక కేంద్రం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటా నిధులను 50 శాతానికి పెంచాల్సి ఉండగా కేవలం 41 శాతానికే పరిమితం చేస్తూ లక్షల కోట్ల రూపాయలను తన ఖజానాను నింపుకుంటోందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ వాలకం చూస్తుంటే భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సహాయం చేసే అవకాశాలు కనిపించడంలేదని అంటున్నారు. అసలు ఈ భారీగా పన్నుల రూపంలో వసూలు చేస్తున్న లక్షలాది కోట్ల రూపాయల నిధులను ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అర్ధంకావడంలేదని, అడ్డగోలుగా ఖజానాను నింపుకొంటూనే పెట్రో ఉత్పత్తుల ధరలను కూడా భారీగా పెంచుకొంటూ పోతున్నారేగానీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీలేదని, ఈ అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయని ఆ అధికారులు వివరించారు.