Friday, November 22, 2024

ఢిల్లీలో తేల్చుకుంటాం

- Advertisement -
- Advertisement -

Center is not giving proper clarity on paddy grain purchases:KCR

వానాకాలం ధాన్యం ప్రతి గింజా కొంటాం

మంత్రులు, అధికారులతో వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తాం, వీలైతే ప్రధాని మోడీతోనూ మాట్లాడుతాం, ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో కేంద్రం చెప్పాలి, అనూరాధ కార్తె వచ్చేసింది, పంటలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి, రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా నీటి వాటాను తేల్చడం లేదు, విభజన చట్టం సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి,

ఉత్తరాది రైతులు అద్భుతమైన
విజయం సాధించారు ఉద్యమ
రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి
పంటలకు కనీస మద్దతు ధర చట్టం
తేవాలి విద్యుత్ బిల్లును వెనక్కి
తీసుకోవాలి ఎస్‌సి వర్గీకరణపై
తేల్చాలి ఎస్‌టి కోటా పెంచడానికి
అనుమతి ఇవ్వాలి కులగణన
ఎందుకు చేయడం లేదు? అసెంబ్లీలో
ఏకగ్రీవ తీర్మాన చేసినా కేంద్రం నుంచి
స్పందన కరవు రాష్ట్ర రైతులకు
స్థానిక బిజెపి నాయకులు క్షమాపణలు
చెప్పాలి : మీడియాతో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని, అందుకే చివరి ప్రయత్నంగా అధికారులు, మంత్రులతో కలిసి ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఎంపీలు కేకే, నామానాగేశ్వర్, మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లతో కలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.

ఏడాదిలో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అనురాధకార్తె వచ్చేసింది.. దీనిపై ఇంకా తాత్సారం చేయొద్దని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం…మాట్లాడతామని కేంద్రం చెప్పిందని, బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం చెప్పినట్టు వార్తలొచ్చాయని .. కానీ అందులో ఎంతవరకు నిజముందో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో చర్చించేందుకు మంత్రుల బృందం, సిఎస్ సహా అధికారుల బృందం కలిసి అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను, అధికారులను, ఎఫ్‌సిఐని కలవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

రైతులు అద్భుత విజయం సాధించారు

కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు అద్భుత విజయం సాధించారని సిఎం కెసిఆర్ ప్రశంసించారు. రైతు ఉద్యమాల సందర్భంగా పెట్టిన వేలాది కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు తెలిపుతున్న వారిపై దేశం ద్రోహం కేసులు కూడా పెట్టారన్నారు. బెంగుళూరుకు చెందిన దిశ అనే అమ్మాయి ట్విట్టర్ ద్వారా రైతులకు మద్దతు తెలిపితే ఆమెపై కూడా కేసు పెట్టారని చెప్పారు. అమాయకులపై పెట్టిన కేసులన్నీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

అమరులైన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున ఇస్తాం

రైతుల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించిందని కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పొప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ముమ్మాటికీ తప్పు అని, ప్రధాని మోదీ తప్పు తెలుసుకుని రద్దు చేసి క్షమాపణ కోరారని పేర్కొన్నారు. సాగు చట్టాల కోసం ఉద్యమించి అమరులైన అన్నదాతల కుటుంబాలను కేంద్రమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో సుమారు 700 నుంచి 750 మంది వరకు రైతులు ప్రాణాలు కోల్పోయారని, ప్రతి రైతు కుటుంబానికి కేంద్రం రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అన్నారు. ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సిఎం కెసిఆర్ నివాళులర్పించారు అలాగే ఒక్కో కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇందుకు రూ.22 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. అమరులైన రైతుల వివరాలను ఇవ్వాలని రైతు సంఘం నాయకులను అడిగాం.. ఆ నేతలను సంప్రదించి అమరులైన రైతుల కుటుంబాలను రాష్ట్ర మంత్రులు, అవసరమైతే తానే వెళ్లి స్వయంగా కలిసి వారికి ఎక్స్‌గ్రేషియో అందిస్తామని చెప్పారు. రైతులు పోరాటం ఎంతో స్ఫూర్తిమంతమైనది అన్నారు. దేశంలో పంటలకు కనీస మద్దతు ధర చట్టం తేవాలని సిఎం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కనీస మద్దతు ధర చట్టాన్ని ప్రవేశపెట్టాలని…అందుకోసం టిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు.

విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి

వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలిన ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ చేశారు. విద్యుత్ చట్టం ఇంకా పాస్ కాలేదు… పాసైతే చాలా తీవ్రమైన ఆందోళన దేశవ్యాప్తంగా చెలరేగుతాయని అన్నారు. మళ్లీ ఒకసారి రైతులంతా బజారునపడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, విద్యుత్ చట్టం తెచ్చి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి చేస్తోందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తెలంగాణ రైతు లోకం చాలా నలిగిపోయింది.. నష్టపోయింది.. కష్టపడ్డది కాబట్టి వారిని ఆర్థికంగా స్థితిమంతులను చేయడం కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆత్మవిశ్వాసంతో బతికేటట్టు తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టామని అన్నారు. ఆ చర్యల్లో భాగంగా నాణ్యమైన 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, కానీ, కేంద్రం నూతన విద్యుత్ చట్టం తెచ్చి రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నదని చెప్పారు. ప్రతి బోరు వద్ద మీటరు పెట్టాలని చెబుతున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఆదేశించడం సమంజసం కాదని పేర్కొన్నారు.

ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాలను అనవసరంగా ఒత్తిడికి గురి చేయొద్దని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేంద్ర తెచ్చిన విద్యుత్ చట్టం మీద విద్యుత్ కార్మికులు, రైతులు, ప్రజలు ఆందోళనతో ఉన్నారని, మరీ ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రం చాలా ఆందోళనతో ఉన్నదని అన్నారు. తాము మీటర్లు పెట్టేందుకు సిద్ధంగా లేమని, మీరేమో పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రాలు మీ చట్టం అమలు చేయమని తమపై మీద భయంకరమైన ఒత్తిడి తెస్తూ, తమకొచ్చే నిధులు నిలిపేస్తమని ఇంకో రకమైన పద్ధతిని అవలంభిస్తున్నారని ఇది కరెక్టు కాదని పేర్కొన్నారు. ఇది నియంతృత్వ వైఖరి అయితదని అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని హక్కులు, బాధ్యలున్నాయని తెలిపారు. బాయిలకాడ మీటర్లు పెట్టండి… బోర్లకాడ మీటర్లు పెట్టం అనేది దుర్మార్గమైన చర్య.. అది కూడా వ్యవసాయ వ్యతిరేక చర్య అని విమర్శించారు. వ్యవసాయ చట్టాలతో విద్యుత్ చట్టాన్ని పాస్ చేయకుండా వాపస్ తీసుకోవాలని, తాము టిఆర్‌ఎస్ పార్టీ నుంచి విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తామని, లోక్‌సభలో, రాజ్యసభలో తమకున్న శక్తిమేరకు పోరాడుతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

మా నీటి వాటా ఎంతో తేల్చండి

రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లయినా … కేంద్రం ఇంకా నీటి వాటాలు తేల్చలేదని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ నీటి వాటా ఎంతో స్పష్టం చేయాలని… ఈ విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారం తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిందని పేర్కొన్నారు. సెక్షన్ 3 కింద గోదావరి, కృష్ణా నది నీటి పంపకాలపై ట్రిబ్యూనల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై దిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోడీని, కేంద్ర జలశక్తిశాఖ మంత్రిని కలిసి నీటి వాటా తేల్చాలని కోరతామని అన్నారు. నిర్ధేశిత సమయంలో కృష్ణా , గోదావరిలో రెండు రాష్ట్రాలకు నీటి వాటాలను తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం చెప్పిందని తాము సుప్రీంకోర్టులో కేసు కూడా ఉపసంహరించుకున్నామని గుర్తు చేశారు. నీటి వాటాలు తేల్చని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని అన్నారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ…నీటి వాటా తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ , ఆ బాధ్యతను విస్మరించింది అని వ్యాఖ్యానించారు. దయచేసి వెంటనే నీటి తేల్చాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.

వానా కాలం పంటలో ప్రతిగింజా కొనుగోలు చేస్తాం

రాష్ట్రంలో వానాకాలం పంటలో చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సిఎం ప్రకటించారు. రాష్ట్రంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. బిజెపి నాయకులు చేసే చిల్లర ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. యాసంగికి రైతుబంధు కూడా సకాలంలో ఇస్తామని వెల్లడించారు. రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీ పర్యటనలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరి తేల్చుకొని వస్తామని తెలిపారు. యాసంగిలో ఏయే పంటలు పండించాలనేది ఢిల్లీ పర్యటన అనంతరం చెప్తామని తెలిపారు.

బిసి కులగణన చేపట్టాలి

బిసి కులగణన చేపట్టాలని బిసిలు అడుగుతున్నారని, అది న్యాయమైన డిమాండ్ అని కెసిఆర్ అన్నారు. కులగణన చేయమని కేంద్రం ఎందుకు చెబుతుందని ప్రశ్నించారు. ఈ దేశంలో కులం ఉంది…ప్రభుత్వాలే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నాయని, అలాంటప్పుడు కులగణన చేయడానికి ఇబ్బంది ఏంటని అడిగారు. ఏ కులంలో ఎంత మంది ప్రజలు ఉన్నారో తేల్చలేని పరిస్థితి దేశంలో ఎందుకొచ్చిందని అడిగారు. రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పెరిగిన గిరిజనుల జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంపును అనుమతి ఇవ్వాలని తాము కోరితే, దానిని తేల్చకుండా తొక్కిపెట్టారని అన్నారు. తెలంగాణలో ఎస్‌టి రిజర్వేషన్ల పెంపునకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. ఎస్‌సి వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే దానిపైనా కేంద్రం నుంచి స్పందన లేదని అన్నారు. ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణపై ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్ చేశారు.

బిజెపి నేతలు తప్పును ఒప్పుకుని రైతులకు క్షమాపణ చెప్పాలి

స్థానిక బిజెపి నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా తప్పును ఒప్పుకొని తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. ఇంకా అడ్డగోలుగా మాట్లాడతామంటే కుదరదని పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించాలని సిఎ కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News