తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్‌పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా ముందుకు పడని అడుగు
నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటుపైనా దాటవేత ధోరణి
కీలక సమస్యల పరిష్కారంలో మీనమేషాలు
కేంద్రం వైఖరితో రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల నిర్మాణాలు
మన తెలంగాణ /హైదరాబాద్ : బంగారు తెలంగాణ సాధనే లక్షంగా భారీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం సహకరించకపోగా మోకాలడ్డుతోందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత స్వరాష్ట్రం, స్వపరిపాలనలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించుకొంటూ తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరించుకొంటూ వస్తున్న ర్రాష్ట్ర పభుత్వానికి కృష్ణానదీ జలాల్లో నిర్ధిష్టమైన నికర జలాల కేటాయింపులు చేయకుండా పరోక్షంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరక్కుండా కేంద్రం మోకాలడ్డుతోందని పలువురు సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవడమంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లేననే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జస్టిస్ బ్రజేష్ కుమార్ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపే విధంగా ఉండటంతోనే ఏడున్నర సంవత్సరాలు ప్రభుత్వం కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరిపింది. లేఖలు రాసింది. చివరకు సుప్రీంకోర్టులో కేసులు పెట్టింది.
కొత్త ట్రిబ్యునల్ వేయాలంటే సుప్రీంకోర్టులో పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని షరతు పెట్టిన మాటను నమ్మి కేసును ఉపసంహరించుకొని నాలుగు నెలల సమయం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకూ కేంద్రం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదో విధంగా లిటిగేషన్లు పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకోవడం, కల్వకుర్తి ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తూ శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం కృష్ణా జలాలను కబళించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డామని, దీనంతటికీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష ధోరణులే ప్రధాన కారణమని అధికారవర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినందున, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన అనేక అభివృద్ధి పథకాలను చేపట్టిన ప్రభుత్వానికి కృష్ణానదీ జలాల్లో నిర్ధిష్టమైన నికర జలాల కేటాయింపులు జరగకపోవడం అతిపెద్ద లోపంగా మారిపోయిందని అంటున్నారు. అనేక లొసుగులు, వివాదాలు, నీటిపారుదల ఇంజనీరింగ్ సూత్రాలకు తిలోదకాలిచ్చి అవార్డును రూపొందించిన జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ సిఫారసులను రెండు తెలుగు రాష్ట్రాలూ పూర్తిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా కృష్ణానదీ జలాలు ఎంతో కీలకమైనవి కావడంతో మూడు రాష్ట్రాల జల వివాదాలు కాస్తా నాలుగు రాష్ట్రాల జల వివాదాలుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు కృష్ణానదిపై కేవలం మూడు భాగస్వామ్య రాష్ట్రాలు ఉండేవి.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం, స్వపరిపాలనలో బంగారు తెలంగాణను సాధించుకునే లక్షంతో సాగు నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి రావడం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను విస్తృతంగా అభివృద్ధి చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లక్షంగా పెట్టుకోవడంతో నదీ జలాల వినియోగంలో ప్రాధాన్యతలు మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటా నీటిలో అన్యాయం జరుగుతుండటంతో న్యాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టులను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగా ఉంది.
నీటి లభ్యత 65%గా లెక్కించడమే అన్యాయం..
నదీ జలాల కేటాయింపుల్లో తీసుకోవాల్సిన సాంకేతికపరమైన ప్రమాణాల్లో జస్టిస్ బచావత్ అవార్డు ఒక భగవద్గీత లాంటిదని, ప్రపంచం యావత్తూ అనుసరించిన విధానాలనే జస్టిస్ బచావత్ అవార్డులో నదీ జలాల కేటాయింపులు జరిగాయని పలువురు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. అదే జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులో అనుసరించిన ప్రమాణాలు కృష్ణానదికి ఎగువన ఉన్న రాష్ట్రాలకు మేలు చేసేవిగానూ, దిగువన ఉన్న తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే విధంగా ఉన్నాయని, అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందని వివరించారు. కృష్ణానదీ జలాలపై ఆధారపడిన ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల తాగునీరు, సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కొరత సమస్యలను కూడా తీర్చాల్సిన భారం కృష్ణానదిపైనే ఉందని జస్టీస్ బచావత్ అవార్డు స్పష్టంచేసింది.
అందుకే బచావత్ అవార్డును ఖరారు చేసే సమయంలో నదిలో నీటి లభ్యతను లెక్కించే సమయంలో 75 శాతం డిపెండబుల్ ఈల్డ్ ప్రాతిపదికన భాగస్వామ్య రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపారు. ఆ లెక్కన మహారాష్ట్రకు నికర జలాలు 560 టి.ఎం.సీ.లు, పునర్వినియోగ జలాలు 25 టీ.ఎం.సీ.లను కలుపుకొని 585 టీ.ఎం.సీ.లను కేటాయించారు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి నికర జలాలు 700 టీ.ఎం.సీ.లు, పునర్వినియోగ జలాలు 34 టీ.ఎం.సీ.లు కలుపుకొని మొత్తం 734 టీ.ఎం.సీ.లు కేటాయించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నికర జలాలు 800 టీ.ఎం.సీ.లు, పునర్వినియోగ జలాలు 11 టీ.ఎం.సీ.లు కలుపుకొని మొత్తం 811 టీ.ఎం.సీ.లను భాగస్వామ్య రాష్ట్రాలకు కలిపి మొత్తం 2130 టీ.ఎం.సీ.లను కేటాయించారు. నీటిపారుదల సూత్రాల ప్రకారం ఒక నదిలో నీటి లభ్యతను వంద ఏళ్ళల్లో 75 ఏళ్ళపాటు జరిగిన నీటి ప్రవాహాన్ని లెక్కల్లోకి తీసుకొని దాన్నే నదిలోని నీటిలభ్యతగా పరిగణిస్తారు. ఈ లెక్కన జస్టీస్ బచావత్ కృష్ణానదిలో మొత్తం 2060 టీ.ఎం.సీ.లు మాత్రమే నీరు ఉందని లెక్కించారు.
కానీ 2004 ఏప్రిల్‌లో ఏర్పాటైన జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నీటిపారుదల సూత్రాలకు విరుద్ధంగా 65 శాతం డిపెండబుల్ ఈల్డ్ ప్రాతిపదికన నీటి లభ్యతను లెక్కించారు. ఈ 65 శాతం లెక్కలతో నదిలో నీరు ఎక్కువగా ఉన్నట్లు చూపించడం, ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు పెరిగేటట్లు చేయడంతో దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగింది. అందుకే జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డును అమలు చేయవద్దని, నోటిఫికేషన్‌ను జారీ చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతూనే ఉంది. కృష్ణానదిలో భాగస్వామ్య రాష్ట్రాలైన మహారాష్ట్రకు 666 టీ.ఎం.సీ.లు, కర్ణాటక రాష్ట్రానికి 911 టీ.ఎం.సీ.లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1001 టీ.ఎం.సీ.ల నీటిని జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో కేటాయింపులు జరిపారు. ఈ లెక్కలు, అంకెల గారడీతో ఎగువ రాష్ట్రాలకే అధిక ప్రయోజనం కలిగే విధంగా చేయడంతోనే ఆ అవార్డును తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఎందుకంటే పెంచిన నీటి కేటాయింపులకు అనుగుణంగా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు నీరంతా నీటి నిల్వ సామర్థం పెరిగిన ప్రాజెక్టుల్లో నిలిచిపోతే దిగువన తెలంగాణకు వరదనీరు వచ్చే అవకాశమే ఉండదని ఆ ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. బచావత్ అవార్డులో కర్ణాటక రాష్ట్రానికి 700 టీ.ఎం.సీ.లు కేటాయించినప్పుడే ఆల్మట్టి డ్యాంను 519 మీటర్లకు బదులుగా 524 మీటర్ల ఎత్తుకు నిర్మించుకోవడం, రోడ్డు బ్రిడ్జీల కింద చెక్ డ్యాంలు నిర్మించుకోవడం, నదీ జలాలను భారీ మోటార్లతో తోడుకునే వారికి అధికారికంగా కరెంటు ఇవ్వడం వంటి అనేక చర్యలతో కర్ణాటక అక్రమంగా సుమారు 288 టీ.ఎం.సీ.ల నీటిని అదనంగా వాడుకుంటోందనే ఆరోపణలు ఉన్నాయి. అదే కర్ణాటక రాష్ట్రానికి జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో 65 శాతం డిపెండల్ ఈల్డ్ లెక్కలతో నీటి కేటాయింపులు పెంచారని, ఆ రాష్ట్రానికి ఏకంగా 911 టీ.ఎం.సీ.లు కేటాయించారని, దాంతో నదిపై మరికొన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా లేక ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల ఎఫ్.ఆర్.ఎల్.ను పెంచుకొన్నా, ఇతర బేసిన్లకు నీటిని తరలిస్తూ కూడా ఏకంగా 1200 టీ.ఎం.సీ.ల నీటిని వినియోగించుకునే కెపాసిటీ ఆ రాష్ట్రానికి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇక ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1001 టీ.ఎం.సీ.ల నీటిలో కనీసం 550 టీ.ఎం.సీ.లు కూడా రావని అంటున్నారు. అందుకే ఇలాంటి సాంకేతికపరమైన ఎన్నో అంశాలు జస్టీస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేవి ఉన్నాయని, అందుకే నూతన ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని, సుప్రీంకోర్టును అభ్యర్ధిస్తూ వచ్చిందని వివరించారు. కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడంలో ఎంత కాలయాపన చేస్తే అంతలా మిగతా భాగస్వామ్య రాష్ట్రాలకు మేలు జరుగుతందేగానీ, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం త్వరగా కళ్ళు తెరవాలని నిపుణులు కోరుతున్నారు.
కృష్ణానదీ జలాలపైన ఆధారపడి తెలంగాణ ప్రభుత్వం సుమారు 40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ సహా మరో పది జిల్లాల ప్రజలకు తాగునీరు, నల్గొండ జిల్లాలోని ఫ్లోరిన్ బాధిత ప్రజలకు సురక్షితమైన నీటిని అందించాలని లక్షంగా పెట్టుకొన్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా అనేక రకాలుగా మోకాలడ్డుతోందని ఆ అధికారులు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం కృష్ణానదీ జలాల్లో 500 టీ.ఎం.సీ.ల నిర్ధిష్టమైన వాటా నీరు కావాలని అడుగుతోంది. అంతేగాక శ్రీశైలం ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టులోనికి వచ్చే నీటిని మొత్తాన్ని విద్యుత్తు వినియోగానికి మాత్రమే పరిమితం చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
అంతేగాక రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా మొత్తం భాగస్వామ్య రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు కలిపి ఏర్పాటు చేయాలని, అలాగైతేనే నదీ జలాల వినియోగంలో ఎలాంటి గొడవలు లేకుండా భాగస్వామ్య రాష్ట్రాలు ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇంతటి భారీ సమస్యను పరిష్కరించకుండా, కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని అధికారవర్గాలు సైతం మండిపడుతున్నాయి. ఇకనైనా త్వరగా కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి జల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా చేయాలని ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు కేంద్రాన్ని కోరుతున్నారు.