Saturday, December 21, 2024

ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్‌సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని విమర్శించింది. ఈమేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పేర్లకు ప్రధాని మోడీ నేతృత్వం లోని కమిటీ ఇటీవల ఆమోదం తెలిపింది. దీనికి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్న కమిటీ సమావేశమైంది.

అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నియామకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఈనెల 8 న రాజీనామా చేయడం, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే కాలపరిమితి ఫిబ్రవరి 14న ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడిన రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం వీరిద్దరితో భర్తీ చేసింది. ఎన్నికల సంఘం(ఈసీ)లో ఖాళీ అయిన రెండు కమిషనర్ పోస్టుల భర్తీ ఎంపిక కమిటీలో సీజేఐను మినహాయించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త కమిషనర్ల నియామకాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల నియామక చట్టం 2023 ప్రకారం చేపట్టకుండా కేంద్రాన్ని అడ్డుకోవాలని పిటిషనర్లు కోరారు.

అయితే వారి నియామకాన్ని తాత్కాలికంగా నిలిపేసేందుకు ఇటీవల సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ క్రమం లోనే పిటిషనర్లను ఉద్దేశించి కేంద్రం స్పందించింది. ఆ ఇద్దరు కమిషనర్ల యోగ్యత, అర్హతపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎలాంటి ఆధారాలు లేని ప్రకటనల ద్వారా వివాదం సృష్టించాలని చూస్తున్నారని విమర్శించింది. తమ అభ్యంతరాలను సమర్పించడంలో వారు విఫలమయ్యారని వెల్లడించింది. దీని ఆధారంగా వాటిని కొట్టివేయాలని కోర్టును కోరింది. ఈ అంశంపై గురువారం (మార్చి 21) విచారణ జరగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News