టిబి పరీక్షలు చేయించుకోవాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ : ఒకవైపు కరోనా పీడిస్తుంటే మరో వైపు టిబి (క్షయ) కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం శనివారం కీలక ప్రకటన చేసింది. టిబి, బ్లాక్ ఫంగస్ వంటి వ్యాధులు అవకాశ వాద సంక్రమణ వ్యాధులని బలహీనంగా ఉన్న వారిపై దాడి చేస్తాయని, అందువల్ల కరోనా నుంచి కోలుకున్న వారు తమ ఇమ్యునిటీ బలోపేతం కాడానికి ప్రయత్నించాలని కేంద్రం సూచించింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారంతా తప్పనిసరిగా టిబి పరీక్షలు చేయించుకోవాలని, అలాగే టిబి రోగులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కారణంగా టిబి కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి సరైన ఆధారాలేవీ లేవని పేర్కొంది. కొవిడ్ నిబంధనల కారణంగా 2020 లో టిబి కేసులు 25 శాతం తగ్గాయని దీని నివారణకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలియచేసింది.