ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, న్యాయస్థానాల రాజ్యాంగ విహిత, జనహిత కార్యాచరణ చిమ్మచీకటినైనా చెదరగొట్టి శుభోదయ కిరణాలకు దారి చేస్తాయనే నమ్మకం ఇప్పటికైనా కలగడం మంచి పరిణామం. పరిస్థితులు ప్రసాదించిన విజయ గర్వం తో ప్రదర్శించే రాజీలేని మొండితనం ఊహించని ఓటమి ఉక్కు పిడికిట్లో పిండి పిండి అయిపోతుందని కొన్ని సందర్భాలు రుజువు చేస్తుంటాయి. 18 ఏళ్లు, ఆ పైబడిన దేశ ప్రజలందరికీ ఈ నెల 21 నుంచి కొవిడ్ 19 టీకాలను కేంద్రమే ఉచితంగా వేయిస్తుందని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాకు రూ. 150 సేవా రుసుం మాత్రమే తీసు కుంటారని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు జాతినుద్దేశించి చేసిన ప్రకటన జాతీయ వ్యాక్సిన్ విధానంపై గత కొంత కాలంగా సాగిన మథనం, సుప్రీంకోర్టు తీసుకున్న చొరవల ఫలితమేనని చెప్పాలి. ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వం ఆది నుంచి అవలంబిస్తున్న విధానాల సరళిని గమనించేవారికి ఒక విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యాపార వర్గాల, కార్పొరేట్ దిగ్గజాల ప్రయోజనాల్లోనే ప్రజల మేలు ఇమిడి ఉందని, వారి పల్లకీ మోయడం ద్వారానే వీరి అవసరాలు తీర్చగలమని ఆయన గాఢంగా నమ్మి దానినే ఆచరణలో పెడుతూ వచ్చారు.
పబ్లిక్ రంగ పరిశ్రమలన్నింటినీ ఉన్నపళంగా ప్రైవేటుపరం చేయడానికి నిర్ణయించినప్పుడు ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యాపార సంస్థలకు, వ్యాపారాలకు దన్నుగా నిలవడమే ప్రభుత్వం బాధ్యత అని, తనకు తానుగా వాణిజ్యాన్ని చేపట్టనవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు (ప్రభుత్వరంగ పరిశ్రమలు) అమ్మి సొమ్ము చేసుకోడం, ప్రైవేటు రంగానికి విశేష ప్రాధాన్యమివ్వడం పౌరుల సాధికారతను పెంచుతుందని కూడా చెప్పారు. ఆ ప్రకారం దేశంలోని లాభాల్లో నడిచే అవకాశమున్న వాటితో సహా కొన్ని పదుల ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటైజేషన్‌కు దారులు వేస్తున్నారు. ఎల్‌ఐసిని కూడా ప్రైవేటు వాటాదారుల చేతుల్లో పెడుతున్నారు. రైల్వేను ఇప్పటికే ప్రైవేటు పట్టాలుగా మార్చివేశారు. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకులను కూడా కార్పొరేట్ శక్తుల చేతికి అప్పగించే ఫైలును త్వరగా కదుపుతున్నారు. ఈ దృష్టి పరాకాష్ఠకు చేరుకొని చివరకు అత్యంత ప్రాణాపాయ వేళలో, దేశ ప్రజలంతా కొన ఊపిరి కొసన ఎప్పుడూ ఎరుగని భయం గుప్పెట్లో విలవిలలాడుతున్న సమయాన ఆ దుస్థితి నుంచి గట్టెక్కించగల కొవిడ్ టీకాల పంపిణీకి కూడా అదే సూత్రం వర్తింప చేశారు.
18 -44 ఏళ్ల వయసులోని దాదాపు 60 కోట్ల మందికి టీకాలు ఉచితంగా వేయించవలసిన గురుతరమైన జాతీయ బాధ్యత నుంచి తప్పించుకొని వాటిని కొని వేయించే పనిని రాష్ట్రాల మీదికి నెట్టివేశారు. కొవిడ్ టీకాల కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 35 వేల కోట్లు, పిఎం కేర్స్‌లోని అపార నిధులు దగ్గర పెట్టుకొని, కరకు కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా దివాలా తీసిన రాష్ట్రాలపై ఆ భారాన్ని మోపడం న్యాయమా అని సుప్రీం ధర్మాసనం పదేపదే నిలదీసే పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. నదులు శవాల ప్రవాహాలైపోయి, దేశంలోని శ్మశానాలు చాలని రీతిలో కొవిడ్ మృత్యు విహారం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రేక్షక పాత్ర వహించిన మోడీ రాజీనామా చేయాలంటూ జాతి జనులు సామాజిక మీడియాలో డిమాండ్ చేయడం ప్రారంభించారు. కొవిడ్ రెండో కెరటాన్ని ఎదుర్కోడంలో ఆయన వైఫల్యాలను అంతర్జాతీయ మీడియా తీవ్రంగా ఎత్తిచూపి ఎండగట్టడమూ జరిగిపోయింది. ఇంతకాలం దట్టంగా ప్రసరించిన తన కీర్తి చంద్రికలు ఈ దెబ్బతో మసకబారి కనుమరుగైపోయిన కఠోర సత్యాన్ని గుర్తించిన ప్రధాని ఎట్టకేలకు ఉచిత వ్యాక్సిన్ విధానాన్ని ప్రకటించక తప్పలేదు. తాము తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమైనదని అనుమానానికి ఏ మాత్రం సందు లేకుండా వెల్లడైనప్పుడు ఎంతటి బలమైన పాలకులైనా దానిని మార్చుకోక తప్పకపోడమే ప్రజాస్వామ్యం గొప్పతనం.
దేశ ప్రజలందరికీ కేంద్రమే టీకాలు కొని ఉచితంగా వేయించడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని, తాను ఆరాధించి అందలమెక్కిస్తున్న కార్పొరేట్ ఏనుగుల లాభార్జనావకాశాలు దెబ్బ తిని అవి బలహీనపడతాయని ఆందోళన చెంది మూడు విధాలైన వ్యాక్సిన్ ధరల విధానాన్నిప్రధాని మోడీ ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్‌లను మార్కెట్ ధరలకు కొనిపించడం వల్ల ఆ రంగంలోకి కొత్త పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఎదుట వాదించిందంటే ప్రాణాంతక ప్రళయాన్ని కూడా లాభాలు చేసుకోడానికి వినియోగించుకొనే అమానుష వ్యాపార లక్షణం దానిలో ఎంతగా జీర్ణించుకుపోయిందో తెలుస్తుంది. ఎక్కడైనా వ్యాపారం గాని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వేళ దానిని ప్రయోగించరాదని ప్రజలు, సుప్రీంకోర్టు తలబొప్పి కట్టేలా మొట్టి కాయలు వేయడంతో ఇప్పుడు దిగి వచ్చింది. ఈ తెలివి సకాలంలో కలిగి ఉంటే దేశానికి ఇంతటి దుస్థితి దాపురించి ఉండేది కాదు. వేలు, లక్షల విలువైన ప్రాణాలు దక్కి ఉండేవి.