హైదరాబాద్: ఎపి, తెలంగాణలో కొత్త హైవేకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచింది. ఈ కొత్త జాతీయ రహదారి తెలంగాణలోని జిల్లా కల్వకుర్తి నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు వరకు ఉంటుంది. ఇది మొత్తం 255 కిలోమీటర్ల ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి రూ.4,706 కోట్ల అంచనా వ్యయం అవుతుందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణానదిపై వంతెనను నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే నేషనల్ హైవేస్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లను సైతం పిలిచింది.
ఈ నేషనల్ హైవే నాలుగు లేన్లతో ఉంటుంది. ఈ జాతీయ రహదారి తెలంగాణలో 91 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 164 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 7 ప్యాకేజీల్లో పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2023 ఫిబ్రవరి నాటికి టెండర్ల ప్రక్రియ చేపట్టి 18 నెలల్లో దీనిని పూర్తి చేయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు 2024 లోక్ సభ ఎన్నికల తర్వాతే ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.