ఇద్దరు లాయర్ల పదోన్నతిపై వ్యతిరేకత
న్యూఢిల్లీ: పంజాబ్, హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది. పంజాబ్, హర్యానా హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం 13 మంది న్యాయవాదుల పేర్లను ఈ ఏడాది జులైలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పురస్కరించుకుని ఆగస్టు 14ప 11 మంది న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అయితే..న్యాయవాదులు హెచ్‌ఎస్ బ్రార్, కుల్దీప్ తివారీ పేర్లను మాత్రం పక్కనపెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు వర్గాలు తలెఇపాయి. ఈ ఇద్దరిలో ఒకరిపై గతంలో ఆరోపణలు రావడం, మరో వ్యక్తికి తగినంత అనుభవం లేకపోవడం వారి పేర్లను పదోన్నతికి పరిశీలించకపోవడానికి కారణం కావచ్చని వర్గాలు తెలిపాయి. కాగా..వీరి పేర్లను తగిన సమయంలో ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. అంతేగాక..తన సిఫార్సులను పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టు కొలీజియంను కోరే హక్కు ప్రభుత్వానికి ఉందని కూడా వర్గాలు తెలిపాయి.