Wednesday, January 22, 2025

అప్పులపై అమీతుమీ

- Advertisement -
- Advertisement -

కేంద్రానికి ఈనెల 17వరకు గడువు

అప్పుల సమీకరణకు కేంద్రం కొర్రీలపై రాష్ట్రాల కన్నెర్ర
తెలంగాణ బాటలో ఏపీ, కేరళ, తమిళనాడు?
ఇతర రాష్ట్రాలను కూడగడుతున్న ఆర్థికశాఖ
సుప్రీంకోర్టులో కేసు దాఖలుకు యోచన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాల రుణసేకరణకు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తూ, వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం చర్యలను ఒకవైపు జాతీయ స్థాయిలో ఎండగడుతూ మరోవైపు సుప్రీం కోర్టు లో కేసు పెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధికశాఖాధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఆం ధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కూడా కలుపుకొ ని పోవాలని, ఒంటరిగా కేసు వేయాలా? వాటి ని కలుపుకొని సంయుక్తంగా కేసు పెట్టాలా అనే అంశంపై ఆర్ధికశాఖాధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు మంగళవారం ఇతర సీనియర్ అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. అంతేగాక ఒక అంశంపై కలిసి వచ్చే రాష్ట్రాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు పెట్టవచ్చా? లేక ఒక్కొక్క రాష్ట్రం వేర్వేరుగా కేసులు పెట్టాలా? అనే అంశాలపై న్యాయ నిపుణులతో కూడా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఒకే అంశంపై కొన్ని రాష్ట్రాలు కలిసి ఏకతాటిపైకొచ్చి సుప్రీంకోర్టులో ఒకే కేసు పెడితే దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా సంచలనమే అవుతుందని, ఇలాంటి సంచలనాలకు తెలంగాణ రాష్ట్రమే చొరవ చూపిందనే ఒక రికార్డు చరిత్రలో నిలిచిపోతుందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులంటున్నారు.

లేకుంటే కేంద్ర ప్రభుత్వ వేధింపులకు ఒక హద్దుపద్దూ లేకుండా పోతోందని, రాష్ట్రాల అప్పులపైన కేంద్రానికి ఎందుకంత కడుపు మంటో అర్ధంకావడంలేదని ఆ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 17వ తేదీ వరకూ వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని, ఆ తర్వాత కూడా కేంద్రం తెలంగాణ అప్పుల సేకరణకు యధావిధిగా మొండిపట్టుపట్టి అనుమతులు ఇవ్వకుండా నిలిపివేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ అధికారులు వివరించారు. ఎందుకంటే ఈనెల 17వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వేల కోట్ల రూపాయల నిధుల సేకరణకు తెలంగాణ రాష్ట్ర సెక్యూరిటీ బాండ్ల వేలం ఉందని, ఆ వేలం సజావుగా ముగిసే వరకూ వేచిచూడాలని ఉన్నతాధికారులు నిర్ణయించారని తెలిపారు. అప్పటికి కూడా కేంద్రం తన వేధింపుల ధోరణిని మానుకోకపోతే తమతో కలిసి వచ్చే ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరిపి సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు వెనుకాడబోమని కూడా ఆ అధికారులు వివరించారు. అంతేగాక అవసరమైతే అసెంబ్లీని అత్యవసరంగా సమావేశ పరిచి కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను కూడా రాష్ట్రపతి, సుప్రీంకోర్టులకు అందజేసేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచన చేస్తున్నారని ఆ అధికారులు వివరించారు.

లేకుంటే అర్దంపర్ధం లేని తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు, లోపభూయిష్టమైన నిబంధనలతో రాష్ట్రాలపైన అడ్డగోలు షరతులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని వేధింపులకు గురిచేస్తోందని మండిపడుతున్నారు. పైగా సోమవారం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక మంత్రిత్వశాఖ కార్యదర్శి టి.వి.సోమనాధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఎంతో వివరంగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు తమ రాష్ట్రానికే కాకుండా అన్ని రాష్ట్రాలకూ గొడ్డలిపెట్టుగా ఉన్నాయని ఎండగట్టిన విధానానికి రాష్ట్రాల ఆర్ధికశాఖ కార్యదర్శులందరూ సంపూర్ణంగా మద్దతు పలికారని, గతించిన రెండేళ్ళకు కూడా కొత్త ఉత్తర్వులను అమలుచేసే ప్రతిపాదనలు తీసుకొచ్చిన ఘనత కేంద్రంలోని బి.జే.పి ప్రభుత్వానికే దక్కుతుందని, ఇలాంటి తప్పుడు విధానాలు మునుపెన్నడూ ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టలేదని, అందుకే వీడియో కాన్ఫరెన్స్‌లో రామకృష్ణారావు ప్రసంగానికి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఆ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అడ్డగోలు కొర్రీలు పెట్టకుండా రొటీన్ అప్పులకు సకాలంలో అనుమతులు ఇచ్చినట్లయితే ఈపాటికి సుమారు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవని వివరించారు.

అంతేగాక మొదటి క్వార్టర్‌లో ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడి సేకరించే అప్పులు కనీసం 15 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఆ ప్రక్రియ ఈపాటికి ముగింపు దశకు చేరుకునేదని, కానీ కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుండటం మూలంగా ఈ ప్రక్రియకు బ్రేకులుపడ్డాయని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే కేంద్రంపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యామని ఆ అధికారులు వివరించారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈనెల 17వ తేదీ వరకూ కేంద్రానికి కొంత సమయం ఇవ్వాలని, ఈ గ్యాప్‌నే డెడ్‌లైన్‌గా పెట్టామని అన్నారు. ఈలోగా అప్పుల సేకరణకు కేంద్రం విధిస్తున్న అడ్డంకులపై కలిసి వచ్చే రాష్ట్రాలను కూడగట్టే పనిలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు నిమగ్నమయ్యారని ఆ అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం తమ మొండిపట్టును విడనాడుతుందా? లేక తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై సరికొత్త యుద్దానికి తెరతీస్తుందా? అనేది తేలాలంటే 17వ తేదీ వరకూ వేచి చూడాల్సి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News