భారతీయుల తరలింపు చర్యలపై చర్చ
న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్యల దరిమిలా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని, అక్కడ చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తరలించేందుకు చేపట్టవలసిన చర్యలను శనివారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ చర్చించినట్లు తెలిసింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భద్రతకు సంబంధించిన కేంద్ర క్యాబినెట్ కమిటీ కూడా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలను క్యాబినెట్ సభ్యులకు వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఆ దేశానికి పొరుగున ఉన్న రొమేనియా, హంగేరితోసహా ఇతర దేశాల నుంచి ప్రత్యేక విమానాలలో తరలిస్తున్నట్లు మంత్రులకు ప్రభుత్వం వివరించింది. ఉక్రెయిన్‌లో పౌర విమానాశ్రయాలను మూసివేసిన కారణంగా ఆ దేశం నుంచి సరిహద్దుల వరకు భారతీయులను తరలించి పొరుగు దేశాల నుంచి విమానాల ద్వారా భారత్‌కు రప్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతో ఒక ఎయిర్ ఇండియా విమానం రొమేనియా నుంచి ముంబైకు బయల్దేరినట్లు ప్రభుత్వం మంత్రులకు తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించే కార్యక్రమంలో పాల్గొంటాయని ప్రభుత్వం వివరించింది.