Thursday, January 23, 2025

కేంద్రం అప్పు రూ. 164 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా చేసిన అప్పులు రూ.155.8 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు రూ.5.13 లక్షల కోట్లు. వీటికి తోడు మరో రూ.3.12 లక్షల కోట్లు అప్పుగా తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్‌ను ఆశ్రయించింది. ఆర్‌బిఐ కూడా అందుకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర సర్కార్‌కు రూ.3.12 లక్షల కోట్లను రుణాల రూపంలో నిధులను ఇచ్చేందుకు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. దీంతో మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పులు (దేశ ప్రజలపై) రికార్డుస్థాయిలో రూ. 164.05 లక్షల కోట్లకు పెరుగుతున్నాయని ఆర్థికవేత్తలు లెక్కలు వేశారు.

జులై 5 నుంచి సెప్టెంబర్ 27 కేంద్రానికి రూ.3.12 లక్షల కోట్లను అప్పుగా ఇవ్వనున్నట్లుగా ఆర్‌బిఐ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జులై 5 నుంచి మొదలుకొని వరుసగా 13 వారాల పాటు ప్రతీ వారం రూ.24వేల కోట్ల లెక్కన ఆర్‌బిఐ నుంచి కేంద్ర ప్రభు త్వ ఖజానాకు నిధులు వెళ్తాయి. 2023-24వ ఆర్థిక సంవత్సరం ముగిసే (2024 మార్చి 31వ తేదీ)నాటికి కేంద్ర ప్రభుత్వం చేసే దేశీయ అప్పులు ఏకంగా 169 లక్షల కోట్లకు (రూ.170 లక్షల కోట్లు) చేరుతాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం న్నారు. అంతేగాక ఈ అప్పులకు తిరిగి చెల్లించే వడ్డీలకే కేంద్ర ప్రభుత్వం ఏటా సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అత్యంత విలువైన నిధులను చెల్లిస్తోందని, దీంతో అభివృద్ధి పథకాలకు ఇవ్వాల్సిన నిధుల్లో కోతలు విధించడమే కాకుండా రాష్ట్రాల్లో అనేక దశాబ్దాలుగా అమలులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను (సిఎస్‌ఎస్) కూడా ఒక్కొక్కటిగా రద్దు చేయడమో లేక వాటి పరిధిని, ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అనేక ప్రజా వ్యతిరేక పనులకు పూనుకొంటున్నారని ఆర్థికవేత్తలు, నిపుణులు, ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు సైతం కేంద్రం చర్యలను తూర్పారబడుతున్నారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి టి.హరీశ్‌రావు కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను తగ్గించడం, కోత విధించడం మూలంగా ఆ భారమంతా రాష్ట్రాలపైనే పడుతోందని చేసిన విమర్శలను ఆ అధికారులు గుర్తుచేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను తగ్గించడం మూలంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా నిధులు 41 శాతం నుంచి 29.6 శాతానికి పడిపోయాయని ఆ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు దేశ జిడిపిలో రికార్డు స్థాయిలో 87 శాతానికి పెరుగుతాయని ఆ అధికారులు వివరించారు. 2021లో కేంద్ర అప్పులు జిడిపిలో 84 శాతం ఉండగా, 2022 ఆర్థిక సంవత్సరంలో ఆ అప్పులు జిడిపిలో 83 శాతానికి పరిమితమైన కేంద్ర ప్రభుత్వ అప్పులు 2024 మార్చి 31వ తేదీ నాటికి 87 శాతానికి పెరుగుతాయని ఆ సర్వే తెలిపిందని వివరించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే నాటికి దేశం అప్పులు సుమారు రూ.80 లక్షల కోట్ల వరకూ ఉన్నాయని, అవన్నీ 70 ఏళ్లల్లో చేసిన అప్పులని, కానీ నరేంద్రమోడీ ప్రధాని అయిన ఎనిమిది సంవత్సరాల కాలంలోనే దేశం అప్పులు సుమారు 155.8 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. అంటే ఎనిమిదేళ్లలో అప్పులను రెట్టింపు చేసిన ఘనుడు నరేంద్రమోడీ అనే విమర్శలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన 1.50 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోపారని ఆ అధికారులు వివరించారు. వాస్తవానికి ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం దేశం మొత్తం జిడిపిలో 60 శాతానికి (కేంద్రం, రాష్ట్రాలు కలిపి) మించి అదనంగా అప్పులు చేయకూడదని, ఇందులో కేంద్రం 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని వివరించారు. అదే చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదనే నిబంధన ఉందని వివరించారు. ఈ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కేంద్రమే యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకొని అప్పులు చేయడానికి, ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలనే అంశాలపై ఆర్థిక నిపుణులతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసుకొని, వారి సలహాలు, సూచనల మేరకు నడుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News