రైతుల పరిస్థితి అగమ్యగోచరం వడ్లు కొంటామనే రాజకీయానికి రైతుల బలి
ధాన్యంపై కేంద్రం ద్వంద్వ వైఖరి కేంద్రాన్ని ఒప్పించలేని రాష్ట్ర బిజెపి నేతలు
హైదరాబాద్/ మన తెలంగాణ: : యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనే రాష్ట్ర రాజకీయ నేతలు చేసిన తప్పుడు ప్రచారంతో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంట చేతికొచ్చే సమయంలో కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతల రాజకీయాలు ధాన్యం రైతుల పా లిట శాపంగా మారాయి. యాసంగిలో పండించిన ధా న్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం కాడెత్తేయడం, రాజకీయం తప్ప రాష్ట్ర రైతుల ప్రయోజనాలను విస్మరించిన రాష్ట్ర బిజెపి నేతల తప్పుడు వైఖరికి ధాన్యం రైతులు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చెమట చిందించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందో, రాదోనని ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి అన్న దాతకు సున్నం పెట్టడానికి రాజకీయా లు చేయడం రైతు లోకంలో ఆగ్రహానికి కారణమవు తున్న ది. యాసంగికి ముందు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సం జయ్ వరి పంట పండించండి, కొనుగోలు చేయిస్తామని ప్రకటనలు చేసిన వాగ్దానాన్ని మంత్రి కెటిఆర్ ఆధారాల రూపంలో బయటపెట్టినా కేంద్ర, రాష్ట్ర బిజెపి నేతలు ధాన్యం కొనుగోలు పై రైతులకు భరోసా ఇవ్వడంలో వైఫల్యం చెందారు. పంజాబ్, హర్యానాలో 100 శాతం ధాన్యాన్ని కోనుగోలు చేస్తున్న కేంద్రం దేశమంతటా ఒకే విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదో ఇప్పటికీ వివరణ ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
రాష్ట్ర రైతాంగానికి కొండంత అండగా వున్న ప్రభుత్వంపై కక్ష సాధించడానికి రైతుల ప్రయోజనాలను కూడా బలి పెట్టడానికి బిజెపి నేతలు వెనకాడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. లక్షలాది మంది రైతుల జీవితాలతో కూడిన ధాన్యం కొనుగోలు అంశాన్ని జటిలం చేయడమే తప్ప శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం కేంద్రం చేయడం లేదు. పైగా రాష్ట్రాన్ని బదనాం చేయడానికి కొనుగోలు అంశాన్ని కేంద్రం అస్త్రంగా వాడుకుంటున్నది. ధాన్యం కొనుగోలుపై కేంద్రం మెడలు వంచడానికి రాష్ట్ర టిఆర్‌ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా యుద్ధం చేస్తున్నది. ధాన్యంపై కేంద్ర ద్వంద్వ వైఖరిని రైతుల ముందు ఎండగడుతూ రాజకీయాల కోసం బిజెపి చేస్తున్న యత్నాలను దేశ రైతు సంఘాలకు టిఆర్‌ఎస్ ఆధారాలు, గణాంకాలతో సహా వివరిస్తున్నది.
మరో వైపు యాసంగిలో పండించిన రైతు మిల్లర్ల దోపిడీకి గురి కాకుండా ఎలా ఆదుకోవాలో ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనే అవకాశం లేకున్నా జిల్లా స్థాయిలో అధికారుల కమిటీ వేసి రైతులు కనీస మద్దతు ధర మార్కెట్ నుంచి పొందేలా ప్రణాళికను రచిస్తున్నది. ఒక వైపు కేంద్రంపై దండయాత్ర చేస్తూనే మరోవైపు రైతులు ధాన్యం విక్రయం విషయంలో మోసపోకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. అయినా కేంద్ర నేతలు, రాష్ట్ర బిజెపి నేతల వైఖరి మాత్రం ఇప్పటికీ మారలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతులు దండయాత్ర చేస్తున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న బిజెపి నేతలు ఆ వాగ్దానం అమలు విషయాన్ని పక్కకు పెట్టి ప్రభుత్వంపై ధర్నాల రాజకీయానికి దిగడం రైతు లోకంలో నిరసనలకు కారణమైంది.
రెండంచెల వ్యూహం
రాష్ట్రంలో తలెత్తిన ధాన్యం సంక్షోభాన్ని పరిష్కరించేందుకు టిఆర్‌ఎస్ సర్కారు రెండంచెల వ్యూహం ఎంచుకుంది. తెలంగాణలో యాసంగి కింద రైతులు పండించిన ధాన్యంలో చిట్టచివరి గింజను కూడా వదలకుండా కేంద్ర ప్రభుత్వం చేత కొనిపించే దాకా దేశ రాజధాని ఢిల్లీని వేదికగా చేసుకుని ఆందోళనలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న మోడీ సర్కారుకు కనువిప్పు కలిగించి ధాన్యం కొనుగోలుకు అంగీకారం తెలిపేదాకా వత్తిడి పెంచే కార్యక్రమాల కార్యాచరణకు పూనుకుంది. రాష్ట్రంలో మరోవైపు యాసంగిలో సాగు చేసిన వరి కోత దశకు వచ్చింది. ఇప్పటికే అక్కడక్కడా ముందుగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం మార్కెట్‌లో విక్రయానికి తెస్తున్నారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై మొండి వైఖరితో కొనుగోలు కేంద్రాలు తెరవక, రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం తక్కువ ధరలకే విక్రయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అటు కేంద్రం కొనక .. ఇటు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు లేక వరి రైతులు ధాన్యం సంక్షోభంలో నలిగిపోవాల్సి వస్తొంది. ఈ సంక్షోభం బారి నుంచి రైతులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ప్రభుత్వం రూపొందించి రెండంచెల వ్యూహం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ధాన్యం సేకరణకే రాష్ట్రాలతో కేంద్రం ఒప్పదం:
దేశంలో ఆహార భద్రత చట్టాల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణకు మాత్రమే రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో కూడా నూనె గింజల సేకరణ, పప్పు దినుసుల సేకరణ , బియ్యం సేకరణ అని ఎక్కడా లేదని వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. ఆహార ధాన్యాల సేకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పంజాబ్, హర్యానాల నుంచి గోధులతో పాటు రాష్ట్రాల నుంచి పప్పుధాన్యాలు, నూనె గింజలు, వరిధ్యానం సేకరణ అని మాత్రమే జివొల్లో స్పష్టం చేసింది. అంతే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటించి అమలు చేస్తున్న కనీస మద్దతు ధరల్లో కూడా బియ్యం మద్దతు ధర అని ఎక్కడా లేదు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, అదేవిధంగా పప్పుధాన్యాల్లో శనగలకు రూ.7235, నూనెగింజల్లో పొద్దు తిరుగుడుకు రూ.6025 చొప్పున ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం మొత్తం 23 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించింది. మార్కెట్‌లో కనీస మద్దతు లభించనపుడు కేంద్ర ప్రభుత్వం రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధరలకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయాల్సి వుంది.
రైతులు పండించిన 23 రకాల పంటలను నాఫెడ్ , సిసిఐ, ఐకెపి తదితర కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరలకు కొనాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రం పైనే ఉంది. అంతే తప్ప బియ్యం కొనుగోలు అంశం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తర్వుల్లో ఎక్కడా లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. యాసంగిలో రైతులు పండించింది ధాన్యమే తప్ప ఉప్పుడు బియ్యమో లేదా ఉడికించిన బియ్యామో కాదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి కనీస మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేసి వాటిని మిల్లర్ల ద్వారా ఏ రూపంలోకి అవసరమైతే ఆ రూపంలోకి మార్చుకునే అవకాశాన్ని కల్పించుకుంది. తీరా ఇప్పడు యాసంగిలో తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం అడ్డం తిరగడం రైతుల పాలిట పిడుగుపాటుగా మారింది. కేంద్రం ఆహార భద్రతా చట్టంలో ఉన్న అంశాలను ఉల్లంఘిస్తూ, తనకు అనుకూలమైన రీతిలో ధాన్యం సేకరణను మలుచుకునే ప్రయత్నం చేస్తూ రైతులను నష్టాల పాలు చేసే కుట్రలను ఢిల్లీ వేదికగా దేశమంతటికీ తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం ఆందోళనకు సిద్ధమయ్యింది.
జిల్లా కమిటీలతో దోపిడీకి అడ్డుకట్ట
యాసంగిలో ధాన్యం రైతులు తక్కువ ధరలకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోకుండా కెసిఆర్ సర్కారు రెండంచెల వ్యూహంలో భాగంగా జిల్లా స్థాయిలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. దశాబ్దాల తరబడి కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యం సేకరణకు సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందుకు రాకుండా మొండికేసిన కేంద్రం కుట్రపూరిత చర్యలకు రాష్ట్ర రైతులు బలి కాకుండా కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది.ధాన్యం కొనుగోలులో తన బాధ్యతలను విస్మరించి రాష్ట్రాన్ని ఈ ఇరుకున పెట్టాలన్న కేంద్రం కుతంత్రాలను తిప్పికొట్టేందుకు రాష్ట్రం రైతుల పక్షాన పోరుబాటలో ముందుకు సాగుతోంది. జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధరలను తొక్కిపెట్టి తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని పొంచి వున్న మార్కెట్ శక్తులకు అడ్డుకట్ట వేయబోతోంది. కమిటీల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు జరిగి రైతులు కనీస మద్దతు ధరలు పొందేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది.
వరి సాగుకు రెచ్చగొట్టి ముందుకు తోసిన బిజెపిపై రైతుల గుర్రు
కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో యాసంగి సీజన్ కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని కెసిఆర్ ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందుగానే ప్రకటించింది. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను ముందుగానే హెచ్చరించింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేమని, రైతులు వరికి బదులుగా మంచి డిమాండ్ ఉన్న పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసుకోవాలని సూచించింది. వరిసాగు చేసి ధాన్యం విక్రయాల్లో కష్టాలపాలు కావద్దని హెచ్చరించింది. అయితే రా్రష్ట్ర బిజెపి నాయకత్వం రైతులను రెచ్చగొట్టి చివరి గింజ వరకూ కొనుగోలు చేయిస్తామని హామీలు గుప్పించింది. బిజెపి నేతల మాటలు నమ్మిన కొందరు రైతులు వాటి ట్రాప్‌లో పడి వరి సాగు చేశారు. అధిక శాతం రైతులు సిఎం కెసిఆర్ ప్రకటనలతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు.
దీంతో యాంసగిలో 50 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి రావాల్సిన వరి సాగు ఈసారి 35 లక్షల ఎకరాల వద్ద ఆగిపోయింది. సాగు చేసిన వారిలో కూడా కొందరు మిల్లర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నవారు, విత్తన కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అధిక శాతం బిజెపి నేతలు చేసిన రెచ్చగొట్టే ప్రకటనలో ట్రాప్‌లో పడిన వారే ఉన్నారు. నాడు చివరి ధాన్య గింజ కొనుగోలు చేయిస్తాం వరిసాగు చేయమని రెచ్చగొట్టిన నేతలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒప్పించి యాసంగి ధాన్యం కొనుగోలు చేయించాల్సిన బాధ్యతను కూడా విస్మరించి బిజెపి రాష్ట్ర నాయకత్వం ఇంకా రైతులను రెచ్చగొట్టి మరింత నష్టపుచ్చే రాజకీయాలకు పాల్పడుతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.