మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పనుల ప్రాజెక్టుపై ఎన్‌జిటికి బుధవారం కేంద్ర నివేదిక సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ప్రస్తుతం నిలిపివేసినట్లు అందులో పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్‌జీటీకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదికలను సైతం సమర్పించింది.ఇప్పటికే కెఆర్‌ఎంబి నివేదిక ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. వాస్తవ, సాంకేతిక పరిస్థితులపై ఇప్పటికే కెఆర్‌ఎంబి నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలో పేర్కొంది.డిపిఆర్ కోసం పనులు జరిగినట్లు కనిపించట్లేదని ఎన్‌జిటి తెలిపింది. ఇదిలావుండగా తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఎపి ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకునే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు ఉందా లేదా అన్న అంశంపై తమ వాదనలు కూడా వినాలని ఎపి ప్రభుత్వం ఎన్‌జిటిని కోరింది. ఈక్రమంలో ఉల్లంఘనలపై ఎన్‌జిటి చర్యలు తీసుకునే అధికారంపై వాదనలు జరిగిన క్రమంలో వాదనలు వినిపించడానికి ఎపి ప్రభుత్వం మరింత సమయం కోరింది. దీనిపై విచారణను ఈనెల 16కు ఎన్‌జిటి చెన్నై ధర్మాసనం వాయిదా వేసింది.
రాయలసీమ పనులపై ఎన్‌జిటి తెలంగాణ ప్రభుత్వం ఫొటోలు, వీడియోలతో పాటు కీలక ఆధారాలు సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను కెఆర్‌ఎంబి బృందం తనిఖీ చేపట్టిన అనంతరం ఒక నివేదికను ఇప్పటికే ఎన్‌జిటికి అందించింది. తదుపరి విచారణలో అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌జిటి స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశంపై ఎన్‌జిటిలో జరిగిన విచారణలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తన నివేదికను సమర్పించింది. గత రెండు వాయిదాల్లోనూ నివేదిక ఇవ్వకపోవడంతో ఎన్‌జిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విచారణలో నివేదిక సమర్పించినప్పటికీ అక్కడ పనులు జరిగాయో లేదో చెప్పడానికి మొహమాట పడింది. ఈ అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇప్పటికే నివేదిక ఇచ్చిందని మాత్రం పేర్కొంది. అయితే ప్రస్తుతం పనులు జరగడం లేదని స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ప్రస్తుతం ఎలాంటి పనులు జరగడం లేదని నివేదిక సమర్పించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని తెలిపారు. పర్యావరణ అనుమతులకు సవరణలు కోరుతూ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కు కూడా అనుమతులను వర్తింపచేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఇంకా నిర్ణయం తీసుకోలేదని నివేదికలో తెలిపారు.
Central give report to NGT Over Rayalaseema Ethipothala