Wednesday, January 22, 2025

రాష్ట్రానికి కేంద్ర బలగాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం 100 కంపెనీల కేంద్ర సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20వ తేదీ నాటికి ఈ బలగాలు రాష్ట్రవ్యాప్తంగా మోహరిస్తాయి. ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇవి విధులు నిర్వహించనున్నాయి. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో.. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. రూ.37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బుధవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం విలువ రూ.12 కోట్లకు పైగా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార, పోలీసు యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వాహన తనిఖీల్లో ప్రతి రోజూ కోట్ల కొద్దీ నగదు, మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు.. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో బాలానగర్‌లో 10 లక్షలు, చైతన్యపురి ఎక్స్ రోడ్డులో 33.50 లక్షలు జప్తు చేశారు. కూకట్ పల్లి పరిధి ప్రశాంత నగర్, మూసాపేట్, భాగ్యనగర్ కాలనీల్లో సరైన పత్రాలు లేని 8 మంది వాహనదారుల నుంచి 21.69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.27 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. 31.36 లక్షల విలువైన మద్యం, 67.64 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు రూ. 20.43 కోట్ల రూపాయలు కాగా.. 86.92 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం, 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 14.65 కోట్ల రూపాయలు ఉంటుంది. అందులో 24 కిలోల బంగారం, 42 క్యారట్ల వజ్రాలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నవే. గురువారం 22.51 లక్షల విలువైన ల్యాప్‌టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల్లో భాగంగా ఇప్పటి వరకు 1196 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 75 వేలకు పైగా ప్రజల, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, వాటిపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంతర్ రాష్ట్ర సరిహద్దులు 89, ఇతర రాష్ట్రాలతో ఉన్న సరిహద్దులు 169 ఏర్పాటు చేశారు.

ప్రజల ఆస్తులకు సంబంధించి నమోదైన కేసులు 34,338,- ప్రజలు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 22,132,ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కేసులు : 11,434, ప్రైవేటు ఆస్తులపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు 7,322 గా నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News