Friday, April 4, 2025

ఈ అంతరాలు అవాంఛనీయం

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఓ భావనాత్మక మిథ్య అని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టి రామారావు 1984లో. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రజాస్వామికంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టి రామారావు ఈ ప్రకటన చేశారు. ఎన్‌టిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో కేంద్రం చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొప్ప ఉద్యమం నడిచింది. దీంతో ఢిల్లీ సర్కార్ ఆయనను తిరిగి పదవిలోకి నియమించవలసి వచ్చింది.

ఎన్‌టిఆర్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో ముఖ్యమంత్రిల సమావేశానికి దూరంగా ఉండడం ఎంత బాధాకరం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురువు ఎన్‌టిఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సీనియర్ జ్యోతిబసు ఇద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా ఉండాలని రాజీలేని పోరాటం సాగించినవారే. అయినా అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు మమతా బెనర్జీ కానీ చెన్నై సమావేశానికి హాజరు కాకపోవడం విచారకరం. చెన్నైలో ప్రతిపక్షాల సమావేశం ఎజెండా చాలా పరిమితం. ఉత్తర భారతంలో హిందీ మాట్లాడే రాష్ట్రాల పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతినిధ్యం పెంచాలనే భారతీయ జనతా పార్టీ చర్యను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపడమే సమావేశం లక్ష్యం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమతుల్యమైన సంబంధాలు తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేసేందుకు ఆయా పార్టీలు తమ ఎజెండాను విస్తృతం చేసుకోవాలి. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం, జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలను జరపకపోవడం వంటి ఏకపక్ష నిర్ణయాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల గొంతు నొక్కారని చాలా మంది నమ్ముతున్నారు.చెన్నై సమావేశం తన ఎజెండాను మరింత విస్తృతం చేసి కేంద్రం -రాష్ట్రాల సంబంధాలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా తిరిగి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాం.

ఈ అంశాలు రాష్ట్ర నాయకత్వాలను, ముఖ్యంగా మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నాటి నుంచీ ప్రభావితం చేస్తూ వచ్చాయి. రాష్ట్రాలను బేఖాతర్ చేయడం జవహర్ లాల్ నెహ్రూ హయాం నుంచే మొదలైంది. 1957లో కేరళలో ప్రజాస్వామికంగా ఎన్నికైన మొదటి కమ్యూనిస్ట్ ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంతోనే తొలి అడుగు పడింది.1960వ దశకంలో ఆలిండియా కాంగ్రెస్ రాజకీయంగా బలహీనపడడంతో అనేక సమస్యలు తెరమీదకు వచ్చాయి. ఫలితంగా 1969లో కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై జస్టిస్ పి.వి. రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీలో ఓటమి తర్వాత 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం జస్టిస్ ఆర్.ఎస్ సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యంగా గవర్నర్ల పాత్రను పరిశీలించింది.

అప్పటి అన్ని ప్రభుత్వాలు ఈ సంస్థ విలువను లెక్కచేయలేదు. తమిళనాడులో ఉన్నంత దారుణంగా మరెక్కడా గవర్నర్ దారి తప్పలేదు. భారత ఫెడరల్ వ్యవస్థ నిర్మాణం, రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య తలెత్తుతున్న అంశాలను వివరంగా పరిశీలించే మరో కమిషన్ ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. అందువల్ల కొత్తగా చెన్నైలో ఏర్పడిన వివిధ పార్టీలు, సిఎంల సమావేశం హైదరాబాద్‌లో తిరిగి సమావేశమైనప్పుడు అది తన ఎజెండాను మరింత విస్తృతం చేసుకోవాలి. వాస్తవానికి ఆ సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీలు స్వయంగా ఓ రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. అది రాజమన్నారు, సర్కారియా కమిషన్ల సిఫార్సుల అమలును తిరిగి పరిశీలించగలదు.

మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని, భాషా వివాదాల ద్వారా ప్రస్తుతం తలెత్తిన కొత్త సమస్యలకు చక్కటి పరిష్కారాలను చూపగలదు. భారతదేశం ఓ ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రాల యూనియన్ అని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడానికి భారత రాష్ట్రాలు ముఖ్యంగా, దక్షిణాది రాష్ట్రాలు సంఘటితం కావడం ఆసక్తికరమైన పరిణామం. ఇది హిందీ హాట్ ల్యాండ్ అని పిలుచుకునే ఉత్తరాది రాష్ట్రాలకు, కేంద్రానికి, దక్షిణాది రాష్ట్రాలకు మధ్య పెరుగుతున్న దూరాన్ని పదే పదే గుర్తు చేసే పరిణామం. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా గుజరాత్ కే చెందినవారు కావడంతో ఈ అంతరాన్ని పూడ్చడంలో పెద్దగా కృషి జరగలేదు. కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది భారతీయ నాయకులలో ఎవరూ ఆ స్థాయిలో లేకపోవడం తో బలమైన రాజకీయ ముద్ర పడలేదు. గతంలో ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఉన్న సైకలాజికల్ లోటును దూరం భర్తీ చేయడానికి దక్షిణాది రాష్ట్రాలలో శక్తివంతమైన రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకునేవారు.

దీంతో ఆ లోటు భర్తీ అయ్యేది. ఇటీవల సంవత్సరాల్లో అలాంటి ప్రాతినిధ్యం తగ్గడమే కాక, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఉత్తర భారతదేశ ఆధిపత్యాన్ని పెంచింది. దక్షిణాదికి చెందిన, దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించిన ప్రధాని పి.వి నరసింహారావు పట్ల పదవి తొలగిపోయిన తర్వాత ఢిల్లీ పెద్దలు చూపిన దురదృష్టకరమైన ప్రవర్తన, దురుసు ప్రవర్తన అటువంటి ప్రాంతీయ పక్షపాతానికి స్పష్టమైన ఉదాహరణే. చెన్నై సమావేశంలో పాల్గొన్నవారు తమ తదుపరి సమావేశంలో ఉత్తరప్రదేశ్ వంటి బడా రాష్ట్రాన్ని చిన్నచిన్న రాష్ట్రాలుగా తగ్గించడం గురించి ప్రస్తావించవచ్చు. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంపును స్తంభింపజేయాలని డిమాండ్ చేయవచ్చు. అలాగే లోక్‌సభ సీట్ల సంఖ్యలో ఏ రాష్ట్రానికి 10శాతం కన్నా ఎక్కువ వాటా ఉండకూడదనే మరో డిమాండ్ కూడా చేయవచ్చు.

ఉత్తరప్రదేశం వంటి రాష్ట్రాన్ని రెండు లేదా నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలనే డిమాండ్ తరచు వినిపిస్తూనే ఉంది.చెన్నై సమావేశంలో భారత రాష్ట్ర సమితికి చెందిన నాయకుడు కెటి రామారావు లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచడం కంటే, ఎక్కువమంది ఇతరులు చేసిన ముఖ్యమైన సూచనలకు అనుకూలంగా, అనర్గళంగా మాట్లాడారు. నిజమైన లెజిస్లేచర్ సంస్కరణలు రాష్ట్రాల శాసన సభలలో సీట్ల సంఖ్యను పెంచడంతో ప్రారంభం కావాలి. అసెంబ్లీలో మెరుగైన, మరింత మెరుగ్గా ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించడమే డీ లిమిషన్ లక్ష్యం అయితే, ఆ మార్పు రాష్ట్రాల స్థాయినుంచే మొదలు కావాలి. ఎందుకంటే ఓటర్లు ఆసక్తిగా దృష్టి పెట్టే రోజువారీ సమస్యలను వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాలే పరిష్కరిస్తాయి.

అన్ని రాజకీయ పార్టీలు, పంచాయతీలు, మున్సిపల్ సంస్థలకు అధికారాలు, సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉండాలి. ఇది రాజ్యాంగం నిర్దేశించినదే అయినా, అతి తక్కువ రాష్ట్రాలే.. అదీ కొద్దిగా పంచాయతీ, మున్సిపల్ సంస్థలకు అధికారాలు ఇస్తున్నాయి. పలు రాష్ట్రాలలో అంతర్లీనంగా ఉన్న సమస్యలు, ఫిర్యాదులపై చెన్నై సమావేశం దృష్టి పెట్టింది. చెన్నై సమావేశం తర్వాత జరిగే తదుపరి సమావేశం కోసం దేశం ఎదురు చూస్తోంది. చెన్నై సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు కీలక అంశాలను చర్చకు పెట్టిన తమిళనాడు సిఎం స్టాలిన్ అభినందనీయుడు. రాజకీయ ప్రాతినిధ్యం, పాలనాపరమైన అధికారాల పరిధి వంటి అంశాలకన్నా, కేంద్ర, -రాష్ట్ర సంబంధాలను మరింత విస్తృతంగా చర్చించే ప్రజాస్వామిక సైద్ధాంతిక పరమైన అవసరం ఉంది. కేంద్రంలో కొన్ని శక్తులు భారత దేశం రాష్ట్రాల యూనియన్ అనే ఆలోచనకు సవాల్ విసురుతూనే ఉన్నాయి.

రాజ్యాంగం నిర్వచించినట్లుగా నేటి భారత్ అనేది వేర్వేరు రాష్ట్రాలను చట్టబద్ధంగా విలీనం చేయడం ద్వారా ఏర్పడిన ఫెడరల్ వ్యవస్థ. అదే భారతదేశం. ప్రతి భారతీయుడు రాజ్యాంగానికి బద్ధుడై ఇండియా అంటే భారత్ అని తన దేశాన్ని అంగీకరిస్తారు. భారత్‌ను నాగరికపరంగా, చట్టబద్ధమైన సంస్థగా నిర్వచించవచ్చు. పటిష్టమైన రాజ్యాంగం నిబద్ధత, విధేయతను పునరుద్ఘాటిస్తుంది.

– సంజయ్ బారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News